మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు

మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు

తిరుపతి, జూలై-6,  2009: హైందవధర్మాన్ని గ్రామస్థాయిలో బాగా ప్రచారం చేయడానికి పూజావిధానంపై శిక్షణా తరగతులు చక్కగా ఉపకరిస్తాయని తితిదే శ్వేత సంచాలకులు శ్రీభూమన్‌ అన్నారు. సోమవారం శ్వేతలో మత్స్యకారుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మత్స్యకారుల గ్రామాలలో నిరక్షరాస్యత కారణంగా ఎంతో వెనుకబడి వుండడంవలన, అనేక దురలవాట్లకులోను అవుతున్నారని, అటువంటి వారికి దైవభక్తి, హైందవధర్మం, సమాజంపై అవగహన ఏర్పరచడం వలన వారిలో పెనుమార్పులు తీసుకురావాలనే మంచి ఉద్దేశ్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ తీసుకుంటున్న మత్స్యకారులు దైవభక్తి, పెద్దలయెడల గౌరవభావం, శుచి, శుభ్రతను పాటించాలని, అదేవిధంగా దురలవాట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆయాగ్రామాలలోని ప్రజలు దేవాలయ పూజార్లపై ఎనలేని గౌరవం ఏర్పరచుకుంటారని, ఆ గౌరవభావం కొనసాగాలంటే అర్చకుడు తన మంచి అలవాట్ల ద్వారా ఇతరులకి ఆదర్శప్రాయుడై ఉండాలన్నారు.

శ్వేతఆధ్వర్యంలో కేవలం మత్స్యకారులకే గాక గిరిజన గొరవలకు, అర్చక స్వాములకు పూజావిధానంతో పాటు, వివిధ ఆగమాలకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన కల్పించేందుకు తగిన విధంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఏడురోజులపాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల నుండి విచ్చేసిన 52 మంది మత్స్యకార పూజారులు పాల్గొన్నారు. అనంతరం వారికి పూజాసామాగ్రి, వస్త్రములు, శ్రీవారి చిత్రపటములు, ప్రశంసాపత్రములు బహుకరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.