”మనగుడి”తో ఆంధ్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

”మనగుడి”తో ఆంధ్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, 2012 జూలై 21: మనగుడి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు నింపాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం ఆయన మనగుడి కార్యక్రమంపై తితిదే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రమైన  శ్రవణా నక్షత్రం, శ్రావణపౌర్ణమి సందర్భంగా ఆగస్టు 2వ తేదీన తితిదే రాష్ట్ర దేవాదాయ శాఖతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో మనగుడి ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లోని గ్రామదేవతలకు చాలా విశిష్టత ఉందని, అలాంటి ఆలయాలను నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా ఈ ఉత్సవంలో పాల్గొనేలా చేయాలని జిల్లా స్థాయి, డివిజన్ల స్థాయి అధికారులకు సూచించారు. ఉత్సవం రోజున ఆలయాన్ని శుభ్రం చేసుకుని అందంగా ముస్తాబు చేసి ధార్మిక కార్యక్రమాలు, పిల్లల చేత పద్యపఠనం, దేవతా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

అంతకుముందు సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తితిదే అధికారులు సమష్టిగా కృషిచేసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండి బాధ్యతతో విధులు నిర్వహించాలని కోరారు. జూలై 23వ తేదీన తిరుమల నుండి రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పూజాసామగ్రితో వాహనాలు బయలుదేరతాయన్నారు. జూలై 25వ తేదీ నాటికి వాహనాలు ఆయా డివిజన్‌ కేంద్రాలకు చేరతాయని, అక్కడి నుండి మండలాల్లోని ఆలయాలకు తరలించాలన్నారు. జూలై 27వ తేదీలోపు అన్ని ఆలయాలకు పూజా సామగ్రి చేరాలని సూచించారు. అనంతరం ఐదు రోజుల పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ఆలయాలకు చేరుకుని పత్రికా సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీమతి సూర్యకుమారి, శ్రీమతి చెంచులక్ష్మీ, శ్రీ మునిరత్నంరెడ్డి, శ్రీ ఉమాపతిరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ రఘునాథ్‌, మార్కెటింగ్‌ ఈఈ శ్రీ శ్రీనివాస్‌, శ్వేత సంచాలకులు డాక్టర్‌ రామకృష్ణ తదితర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.