KUMARADHARA THEERTHA MUKKOTI ON MARCH 9 _ మార్చి 9న తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

Tirumala, 8 Mar. 20: The important torrent festival of Sri Kumaradhara Theertha Mukkoti will be observed in Tirumala on March 9 on the occasion of Phalguna Pournami on Monday.

Tirumala and Seshachala hills account for countless holy springs and Kumaradhara is one of the prestigious and holiest among them.

Venkatachala Mahatyam refers to only 26 thirthams in which bathing provides Mukti to devout people and Kumaradhara tops the list.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

మార్చి 9న తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల, 2020 మార్చి 08: తిరుమల పుణ్యక్షేత్రంలో మార్చి 9వ  తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఫాల్గుణ మాసం, పుబ్బ‌ నక్షత్రంలో పౌర్ణ‌మినాడు ఈ తీర్థ ముక్కోటి నిర్వ‌హించ‌నున్నారు. ఈ పర్వదినాన భ‌క్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. తిరుమల శేషాచలగిరుల్లో ముక్కోటి తీర్థాలున్నాయని ప్రసిద్ధి. తీర్థాలను ధర్మరతిప్రదాలు, జ్ఞానప్రదాలు, భక్తివైరాగ్యప్రదాలు, ముక్తిప్రదాలు అని నాలుగు రకాలుగా విభజించారు.

ఇందులో ధర్మరతిప్రదాలు 1008 ఉన్నాయి. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే ధర్మాసక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. జ్ఞానప్రద తీర్థాలు 108 ఉన్నాయి. వీటిలో స్నానమాచరిస్తే జ్ఞానం లభిస్తుందని విశ్వాసం. భక్తివైరాగ్య ప్రదాలు 68 ఉన్నాయి. వీటిలో స్నానం చేయడం వల్ల సంసార దుఃఖాలు తొలగిపోయి భక్తితత్వం వైపు మనసు మళ్లుతుందని నమ్మకం. ముక్తిప్రదమైన తీర్థాలు 26 ఉన్నాయి. వేంకటాచల మహత్యంలో పేర్కొన్న విధంగా ముక్తిప్రదమైన తీర్థాల్లో కుమారధార తీర్థం మొదటిస్థానంలో ఉంది. యుగయుగాలుగా ఈ తీర్థం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. పద్మ, వరాహ, వామన, మార్కండేయ పురాణాల్లో ఈ తీర్థ ప్రాశస్త్యం ఉంది.

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

మార్చి 9న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు :

శ్రీవారి ఆల‌యంలో మార్చి 9వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి  గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి వార్షిక తెప్పోత్స‌వాలు జ‌రుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ర‌ద్ద‌యింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.