మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, మే  21, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం ఉదయం గోవిందరాజస్వామివారు  పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 6.00 గంటలకు పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పుష్కరిణి, శ్రీ కోదండరామాలయం వరకు వెళ్లి తిరిగి ఉదయం 10.00 గంటలకు స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్‌, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అందులో హేయమైన విషంతోపాటు ఉపాదేయమైన అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచింపబడడం, దేవతలు అనుగ్రహింపబడడం జరిగింది.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు  స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 నుండి 10.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

పకక్షులలో రారాజు సుపర్ణుడు. స్వామివారికి అత్యంత ఇష్టుడు గరుడుడు. దాసుడుగా, సుఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా, ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు శ్రీనివాసుని మూపుపై వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన, వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుతుడైన గరుడుని దర్శించి అభీష్టసిద్ధి పొందుతారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర పిళ్లై, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం మహతి కళాక్షేత్రంలో ప్రవళ్లిక నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీ చిదంబరశాస్త్రి ధార్మికోపన్యాసం, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్ద శ్రీ ఎం.బి.జయకుమార్‌రెడ్డి హరికథ కాలక్షేపం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శ్రీ రామభట్టార్‌ హరికథా కాలక్షేపం ఏర్పాటుచేశారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.