విద్యార్థులకు ధర్మపరిచయం చేయాలి : ఆచార్య హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద

విద్యార్థులకు ధర్మపరిచయం చేయాలి : ఆచార్య హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద

శుభప్రదం శిక్షణ తరగతుల్లో బోధకులు చిన్న చిన్న కథల రూపంలో విద్యార్థులకు ధర్మపరిచయం చేయాలని ఆచార్య హెచ్‌.ఎస్‌.బ్రహ్మానంద సూచించారు. మే 12 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలో ఏర్పాటుచేసిన నాలుగు శుభప్రదం శిక్షణ కేంద్రాల్లో బోధించనున్న బోధకులకు సోమవారం స్థానిక అన్నమాచార్య కళామందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య బ్రహ్మానంద ప్రసంగిస్తూ ప్రస్తుత సమాజంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు, గురువులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. ఈ కారణంగానే యువతీ యువకుల్లో నైతిక, మానవీయ విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. శుభప్రదం శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పాలని కోరారు.

ఆచార్య సర్వోత్తమరావు మాట్లాడుతూ శుభప్రదం తరగతుల బోధనలో పాటించాల్సిన మెళకువలను వివరించారు. బోధకులు సంప్రదాయ వస్త్రధారణ, తిలకధారణ పాటించాలని కోరారు. సమాజ నిర్మాణంలో ఆలయాల పాత్ర, పండుగలు, మహాభారత కథలు తదితర విషయాలను విద్యార్థులకు బోధించాలని కోరారు. అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.రఘునాథ్‌, ఎపిక్‌ స్టడీస్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీ దామోదర్‌నాయుడు, డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, శ్రీ చెంచుసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.