శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నూతన సేవలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నూతన సేవలు ప్రారంభం

 తిరుపతి, సెప్టెంబరు 07, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నూతనంగా పలు సేవలను ప్రవేశపెట్టారు. వీటిలో రథసప్తమితో పాటు పలు నెలవారీ సేవలున్నాయి.

ఇక నుండి ఆలయంలో ప్రతి ఏడాదీ తిరుమల తరహాలో రథసప్తమి పర్వదినాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. అనంతరం ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు.
ప్రతినెలా విశిష్టమైన రోహిణి నక్షత్రం రోజున శ్రీ వేణుగోపాలస్వామివారు దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ఊరేగింపు అనంతరం ఆలయంలో ఆస్థానం జరుగుతుంది.
ప్రతినెలా పునర్వసు నక్షత్రం పర్వదినం సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఆ తరువాత ఆలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.
ప్రతినెలా పౌర్ణమి రోజున శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తారు. తిరుమలలో పౌర్ణమినాడు శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై విహరిస్తున్న విధంగానే ఇక్కడ స్వామివారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఈ ఆలయంలో వేదాశీర్వచనం సేవను నూతనంగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒర రవికె బహుమానంగా అందజేస్తారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది