ANNUAL ACCOUNTS FESTIVAL_ ANIVARA ASTHANAM OBSERVED _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుమల, 2020 జూలై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో గురు‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

 ముందుగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

 అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌, ఛైర్మన్‌, ఈవో, అద‌న‌పు ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

 తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. అనంతరం ఆస్థానం ముగిసింది.

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ :

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలు సమర్పించారు.

గురు‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు  :

పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీ‌వారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది శ్రీవారి ఆల‌యంలో నిర్వ‌హించే సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానంను శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ‌రంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌యం నుండి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించార‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో నిత్య కైంక‌ర్య‌లు, ఉత్స‌వాలు, నిత్యం ప్ర‌తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి తీసుకున్న చ‌ర్య‌లు, భ‌క్తుల స‌హాకారంతో ద‌ర్శ‌నాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. శ్రీవారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆయురారోగ్యాల‌తో ఉండాలన్నారు.‌    

 ఈ క‌ర్యాక్ర‌మంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డా.నిశ్చిత‌, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఆరోగ్య శాఖాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 16 Jul. 20: The traditional annual budget festival, Anivari Asthanam was conducted at the Srivari temple on Thursday morning in Tirumala.

The Senior and Junior pontiffs of Tirumala Sri Sri Sri Pedda Jeeyangarswami and Sri Sri Sri Chinna Jeeyangarswami, TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, board member Dr Nischita participated in the festival held in Ekantham as per Covid-19 restrictions.

Speaking later to media outside the temple, the TTD Chairman said as a part of the annual festival, silks were offered to Srivaru from Sri Ranganathaswami temple of Srirangam.

He said Nitya Kainkaryas, utsavas and rituals were performed without any lapse by archakas in supervision of the TTD staff in spite of Corona restrictions. Srivari darshan is also continued in a limited way with social distancing and total sanitisation in the temple and surroundings. He said every day Srivari blessings are sought for the overall health and well being of humanity across the world.

Earlier between 7am and 9am, Sri Malayappaswamy and His consorts were seated at Ghanta Mandapam near Bangaru Vakili. While Senadhipathi Sri Viswaksena was seated on the left side. The annual event of Anivariasthanam was celebrated with special pujas and prasadam Nivedanas for utsava idols and Mula Virat together.

Thereafter the Tirumala pontiffs led the procession of offering of silks from Srirangam on six big gold plates of which four plates were offered to Mula Virat and rest two plates to the utsava idols of Sri Malayappaswamy and Sri Viswaksena.

Later on the Srivari Temple Chief Priest, Sri Venugopala Deekshitulu performed the rituals of blessings and handed over of temples key bunch to the Tirumala pontiffs, TTD EO and after other pujas the key bunch of Srivari temple was placed at feet of Mula Virat.

ANNUAL ACCOUNTS SUBMISSION DAY:

Anivara Asthanam ritual is performed as a day of account submission to Lord, a practice started by the Mahants, the past managers of Srivari temple. Legends say that the Mahants took over the management of the Srivari temple on this day and the receipts and expenses statement of the temple administration were presented on the auspicious day. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI