శ్రీవారి పాదాల భద్రతకు చర్యలు – తిరుమల జె.ఇ.ఓ

శ్రీవారి పాదాల భద్రతకు చర్యలు – తిరుమల జె.ఇ.ఓ

తిరుమల, 1 సెప్టెంబరు 2013 : తిరుమల గిరులలోనే అత్యంత ఎతైన పర్వతశ్రేణిగా విశ్వసింపబడే నారాయణగిరిపై ఎన్నో ఏళ్ళ క్రిందట సహజంగా వెలసివున్న శ్రీవారిపాదాల భద్రతకు పటిష్ఠమైన చర్యలు చేపడతామని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు అన్నారు.
ఆదివారంనాడు శ్రీవారి పాదాలకు సంబంధించి బ్రొటనవ్రేలు ఊడిందన్న సమాచారం మేరకు జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌లతో కలసి శ్రీవారి పాదాలను పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ మ్రొక్కులు  తీర్చుకోవడంలో భాగంగా కొందరు అవగాహన లేకుండా ఈ పాదాలపై కొబ్బరి కాయలు కొట్టడంతో ఈ సంఘటన సంభవించిందన్నారు. అలా చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. అసలు శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టవచ్చా లేదా అన్న అంశంపై అర్చకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

జె.ఇ.ఓ వెంట అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌ రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, పోటు పేష్కార్‌ శ్రీ కేశవరాజు తదితరులు ఉన్నారు.

   తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.