శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి

తిరుపతి, మార్చి 10, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 2.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాథ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు రథోత్సవం(భోగితేరు) కన్నులపండువగా జరిగింది.
ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.
ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసేందుకు శ్రీ నాగఫణిశర్మ సాహితీరూపకం, శివకేశవం పేరిట పేరిణి నృత్యం తదితర కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
ఆ తరువాత రాత్రి 12.00 గంటల నుండి మంగళవారం తెల్లవారుజామున 4.00 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, కపిలేశ్వరాలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
మహతిలో ప్రత్యేక కార్యక్రమాలు
అదేవిధంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని  పురస్కరించుకుని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 6.00 గంటల నుండి కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారిచే ”శివరాత్రి మహత్మ్యము” ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు లబ్దప్రతిష్టులైన సాహితీమూర్తులతో ”శివకవుల వైభవం” సాహితీరూపకం, రాత్రి 9.00 నుండి అర్ధరాత్రి 11.00 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరి గిరీష్‌ బృందంతో ”శివ సంకీర్తన లహరి” కార్యక్రమాలు నిర్వహించారు.
————————————————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.