శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం

తిరుపతి, మే 17, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం ఉదయం 10.00 గంటలకు కర్కాటక లగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి. సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ సకలదేవతలను ఆహ్వానిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ధ్వజారోహణం దిగ్విజయంగా జరిగిందన్నారు. ఈ సారి బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఇందుకోసం తగిన ప్రణాళికలు వేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్సవాల సమయంలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరంలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించాలని ఆయన కోరారు.  

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్‌, తిరుపతి జె.ఇ.ఓ. శ్రీ పి. వెంకటరామి రెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి. అశోక్‌ కుమార్‌, ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ టి.ఎ.పి. నారాయణ, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర్‌ పిళ్లై, తితిదే ఆగమ సలహాదారు శ్రీ విష్ణు భట్టాచార్యులు, కంకణ బట్టార్‌ శ్రీ రమేష్‌ దీక్షితులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కాగా ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.   ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు.  వాహనరూపంలో శ్రీగోవిందరాజస్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు మనకు ప్రబోధిస్తున్నారు..

శ్రీపద్మావతి అమ్మవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలుః-

ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తరువాత అంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడానికి తితిదే పాలకమండలి తీర్మానించిందని తెలిపారు. తిరుచానూరులోని 30% స్థలం మాత్రమే దేవస్థానం ఆధీనంలోకి తీసుకొని బ్రహ్మత్సవాల సమయంలో వాహన సేవలకు అనుకూలంగా నాలుగు మాడవీధులను విశాలంగా చేయడం, వసతి భవనాలు, కల్యాణకట్ట, క్యూకాంప్లెక్స్‌, అన్నదాన క్యాంటిన్‌ తదితర నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీనిని స్ధానికులు వేరో కోణంలో ఆలోచించి, లేని పోని అపోహలు పెట్టుకోరాదని విజ్ఞప్తి చేసారు.తితిదే తలపెట్టిన ఈ బృహత్కార్యక్రమానికి స్థానికులు సహకరించాలని కోరారు. స్థానికులకు, భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు ఇ.ఓ తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.