స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు
స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు
శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు తేరుపై మలయప్పస్వామి దివ్య విహారం
మంగళవాయిద్యాలు.. గోవింద నామస్మరణల నడుమ వైభవంగా స్వర్ణరథోత్సవం
తిరుమల, 2026 అక్టోబరు 19: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం తిరుమలలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణకాంతులతో మెరిసే బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ, గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధుల్లో స్వామివారి స్వర్ణరథ విహారం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది.
మహిళల భక్తిశ్రద్ధతో స్వర్ణరథోత్సవం
స్వర్ణరథోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వర్ణరథాన్ని లాగడం విశేషం. బంగారు రథంపై కొలువుదీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు గోవింద నామస్మరణ చేశారు.
స్వర్ణరథ దర్శనం సకల శుభప్రదం
స్వర్ణరథోత్సవాన్ని దర్శించుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి అనుగ్రహంతో సమస్త ధాన్యసంపదలు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కృపతో సుఖసంతోషాలు, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వర్ణరథంపై స్వామివారి దివ్యదర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, దైవానుగ్రహంపై అచంచలమైన విశ్వాసాన్ని అందించింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
























