మే 24, 25వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు

మే 24, 25వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 30, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు మే 24, 25వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.

తిరుమలలో..

మే 25వ తేదీన ఉదయం 8.00 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు, దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ ఉదయం 10.00 గంటల వరకు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి ఘటిస్తారు.  

తరిగొండలో..

తరిగొండ ఆలయంలో మే 24వ తేదీ ఉదయం 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం తితిదే అధికారులు స్వామివారికి, తరిగొండ వెంగమాంబకు నూతన వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత గోష్ఠి, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 25వ తేదీ సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సంగీత సభ, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుపతిలో..

మే 24వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 9.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత గోష్ఠి, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 25వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు ప్రముఖ సంగీత విద్వాంసులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.