వైభవంగా గోవిందుడి రథోత్సవం

వైభవంగా గోవిందుడి రథోత్సవం

తిరుపతి, మే 24, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4.10 నుండి 4.20 గంటల వరకు మేష లగ్నంలో స్వామివారు రథారోహణం చేశారు. 7.40 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు చల్లడం ఆనవాయితీ. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉప్పు, మిరియాలు కలిపి స్వామివారి రథంపై చల్లారు. స్వామివారి రథం చక్రాల కింద పడి నలిగిన ఈ ఉప్పు, మిరియాలను భక్తులు పవిత్రంగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా నలిగిన ఉప్పు, మిరియాలను తింటే శరీరంలోని రుగ్మతలన్నీ హరించుకుపోతాయని అర్చకులు తెలిపారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.
అనంతరం ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీవారికి, నమ్మాళ్వార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖర పిళ్లై, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            –
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.