6వ విడత కల్యాణమస్తుపై జిల్లాల కలెక్టర్లతో తితిదే ఇఓ టెలికాన్ఫెరెన్స్ సమీక్ష
6వ విడత కల్యాణమస్తుపై జిల్లాల కలెక్టర్లతో తితిదే ఇఓ టెలికాన్ఫెరెన్స్ సమీక్ష
తిరుపతి, ఏప్రిల్ -18, 2011: తితిదే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ”కల్యాణమస్తు” రాష్ట్రవ్యాప్త ఉచిత సామూహిక వివాహాల 6వ విడత కార్యక్రమం ఈ ఏడాది మే నెల 20వ తారీఖున జరుగనున్న నేపధ్యంలో తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు వివిధ జిల్లాల కలెక్టర్లతో సోమవారం సాయంత్రం టెలికాన్ఫెరెన్స్ సమీక్షని నిర్వహించారు.
తిరుపతిలోని తితిదే పరిపాలనాభవనములోని సమావేశ మందిరంలో ఈ టెలికాన్ఫెరెన్స్ కార్యక్రమం జరిగినది. అనంతరము విలేఖర్ల సమావేశంలో ఇఓ మాట్లాడుతూ గత ఐదు విడతలలో తితిదే నిర్వహించిన కల్యాణమస్తు కార్యక్రమంలో వేలాది జంటలు శ్రీ వేంకటేశ్వరస్వామి కృపతో ఒక్కటయ్యాయి అని అన్నారు. కాగా తితిదే పంచాంగ కర్తలు శ్రీతంగిరాల ప్రభాకర్ పూర్ణయ్య సిద్ధాంతి, ఆగమ సలహాదారు శ్రీ విష్ణుభట్టాచార్యులు, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తి కూలంకషంగా చర్చించి మూలానక్షత్రయుక్త వైశాఖబహుళ తదియ అయిన మే 20వ తారీఖున కర్కాటక లగ్నమందు ఉ.9.52 నిమిషాల నుండి ఉ.10.04 నిమిషాల మధ్యలో వివాహ శుభమూహుర్తాన్ని నిర్ణయించారన్నారు.
తితిదే లైజన్ అధికారులు ఈనెల 21వ తారీఖున వివిధ జిల్లాల కలెక్టర్లను కలుస్తారన్నారు. అదేవిధంగా వివిధ జిల్లాలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి కల్యాణమస్తుకు తగిన ప్రచారాన్ని కూడా కల్పిస్తామన్నారు. ఈనెల 25వ తేదిలోపు ప్రచార సామాగ్రి అంతా ఆయా జిల్లాలను చేరుతాయన్నారు. ఈకల్యాణమస్తు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భజనమండళ్ళు, శ్రీవారి సేవకుల సహకారాన్ని కూడా తితిదే వినియోగించుకుంటుందని తెలిపారు. ఇక యమ్.ఎస్.ఓ.లను కూడా ప్రచారములో భాగస్వాములను చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్యనిఘా అధికారి శ్రీ యమ్.కె.సింగ్, హిందూధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.వి.బి.సి. సి.ఒ.ఒ. శ్రీ రామానుజం తదితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.