REVIEW MEETING WITH VEG DONORS HELD _ శ్రీవారి అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వి – టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌద‌రి

Tirumala, 18 August 2026: TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary appreciated the contribution of vegetable donors as vital to the Srivari Annaprasadam (free food distribution) programme of TTD. 

A review meeting in connection with ensuing brahmotsavam was held at Sudharma Hall in Tirumala on Tuesday evening to discuss supply, transport, storage, quality and future needs.

Excerpts from the meeting :

Vegetable consumption has risen from about 5.34 tonnes per day three years ago to 8.44 tonnes at present with the serving of over 4lakh portions every day on an average.

The Additional EO appreciated the services of round 30 donors from 3–4 states who have been supplying 33 types of vegetables  from the past 25–30 years.

He said TTD coordinates advance planning with donors to reduce rejection and spoilage; donors maintain quality, packing and transport standards.

Cold storage is used to preserve longer‑lasting vegetables; perishable items are prioritized for early use.

TTD will develop a donor policy and an online real‑time coordination system to communicate needs and speed responses, encouraging more donors to participate.

Participants included Deputy EO Annaprasadam Sri Rajendra, Catering Officer Sri GLN Shastry, vegetable donors from various states and other officials.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వి

టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌద‌రి

తిరుమ‌ల‌, 2026 ఆగ‌స్టు 18: శ్రీవారి అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వ‌ని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. మంగళవారం తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథిగృహంలో గ‌ల సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అన్న ప్ర‌సాదాల త‌యారీకి కూరగాయలు విరాళంగా అందిస్తున్నదాతలతో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు.

అన్న ప్ర‌సాద‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం రోజుకు సుమారు 13–14 టన్నుల బియ్యం, 8 టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూర్చడం విశేషమన్నారు.

గత 25–30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దాతలు కూరగాయలను అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మూడు, నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను స‌మ‌కూరుస్తున్నార‌ని చెప్పారు.

అన్నప్ర‌సాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని వివరించారు. దీంతో కూరగాయల రిజెక్షన్, నష్టాలను గణనీయంగా నియంత్రించగలిగామని చెప్పారు. నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.

కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవైనందున వాటి నిల్వ, వినియోగంపై ప్రత్యేక ప్రణాళిక అవసరమని అదనపు ఈవో తెలిపారు. కోల్డ్ స్టోరేజీ సదుపాయాన్ని వినియోగించుకుంటూ, ఎక్కువ కాలం నిల్వ చేయగల కూరగాయలను తగిన విధంగా నిల్వ చేసి, త్వరగా పాడయ్యే కూరగాయలను ముందుగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మూడేళ్ల క్రితం రోజుకు సుమారు 5.34 టన్నుల కూరగాయల వినియోగం ఉండగా, ప్రస్తుతం అది 8.44 టన్నులకు పెరిగిందన్నారు. అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌ విస్తృతంగా పెరగడంతో కూరగాయల వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.

కూరగాయల దాతలు ఎదుర్కొంటున్న రవాణా, లాజిస్టిక్స్ తదితర సమస్యలను తెలుసుకోవడంతో పాటు, టీటీడీ వైపు నుంచి కూరగాయల స్వీకరణలో ఉన్న సమస్యలను కూడా చర్చించేందుకు ఈ సమన్వయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో దాతల నుంచి విలువైన సూచనలు అందాయని తెలిపారు.

భవిష్యత్తులో కూరగాయల విరాళాల కోసం ప్రత్యేక పాలసీ, ఆన్‌లైన్ సమన్వయ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడి నుంచి ఏ కూరగాయ ఎంత అవసరమో రియల్‌టైమ్‌లో ఆన్‌లైన్ ద్వారా దాతలకు తెలియజేయడం, దాతలు కూడా ఆన్‌లైన్‌లో స్పందించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తే కమ్యూనికేషన్ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. దీనివల్ల మరింత మంది దాతలు ఈ మహత్తర సేవలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

రాబోయే రెండు బ్రహ్మోత్సవాల్లోనూ కూరగాయల దాతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారని అదనపు ఈవో తెలిపారు.

తిరుమలలో శనివారం, ఆదివారం రోజుల్లో సుమారు 4.50 లక్షల అన్నప్రసాద పోర్షన్లు పంపిణీ చేస్తున్నామని, రోజుకు సుమారు 19 గంటల పాటు అన్నదానం వంటశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం శ్రీవారి అనుగ్రహంతోనే సాధ్యమవుతోందన్నారు.

అన్న ప్ర‌సాదాల‌కు కూరగాయలను అందిస్తున్న దాతల సేవలను అభినందిస్తూ, వారిని మరింత ప్రోత్సహించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కూరగాయల దాతలను లడ్డూ ప్రసాదాలతో సత్కరించి, శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

రాబోయే బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు, దాతలు, సేవా సంస్థలు సమన్వయంతో ఒక బృందంగా పనిచేయాలని అదనపు ఈవో పిలుపునిచ్చారు.

ఈ స‌మావేశంలో అన్న ప్ర‌సాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర‌, క్యాట‌రింగ్ ప్ర‌త్యేక అధికారి శ్రీ శాస్త్రి, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన‌ కూర‌గాయ‌ల దాత‌లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.