WHEN DEVOTTION MEETS DIVINITY IN SACRED WATERS…. _ వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం
CHAKRADHARI GETS CHAKRASNANAM
Tirumala, 23 September 2026: The sacred waters in Swamy Pushkarini echoed with thousands of devotees taking a holy dip during the Chakra Snana Mahotsavam, the last major event held as a part of the nine day mega religious annual festival at Tirumala on Wednesday morning.
Earlier the Anthropomorphic form of Srivaru, the Sudarshana Chakrattalwar along with the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi was rendered the auspicious Snapana Tirumanjanam followed by a series of rituals, amidst chanting of divine mantras matching the occasion.
Later the Chakrattalwar was immersed in the holy waters of Swamy Pushkarini with utmost devotion. Thousands of devotees who have been waiting for the auspicious moment took a holy dip in the sacred waters chanting “Govinda… Govinda” with utmost devotion.
After the ritual, speaking on the occasion, TTD EO Sri Ravichandra along with Additional EO Sri Ch Venkaiah Chowdary thanked the TTD employees, police, srivari sevaks, and above all the devotees who cooperated with the management in making the annual mega festival a humongous success.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం
భక్తజన సందోహంతో పులకించిన శ్రీవారి పుష్కరిణి
సుదర్శన చక్ర స్పర్శతో పావనమైన పుష్కరిణి జలాలు
తిరుమల, 2026 సెప్టెంబరు 23: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా అభిషేకం చేశారు.
వేద మంత్ర ఘోషతో ఆధ్యాత్మిక పరిమళం
ఈ సందర్భంగా టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు, దశశాంతి, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర మంత్రాలను ఘనంగా పారాయణం చేశారు. అభిషేకానంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు.
ఉత్సవ యజ్ఞానికి సంపూర్ణత చేకూర్చే అవభృథం
తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలు ఒక యజ్ఞస్వరూపం కాగా, యజ్ఞాంతంలో నిర్వహించే అవభృథస్నానం ద్వారా ఉత్సవ నిర్వహణలో జరిగిన లోపదోషాలు తొలగి, సంపూర్ణ ఫలితాలు చేకూరుతాయని ఆగమ సంప్రదాయం.
సుదర్శన చక్ర స్పర్శతో పావనమైన పుష్కరిణి
స్నపన తిరుమంజనం అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలు మరింత పావనమయ్యాయని విశ్వసిస్తూ, అదే సమయంలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
చక్రస్నానాన్ని దర్శించిన, నిర్వహించిన, సహకరించిన భక్తులందరికీ బ్రహ్మోత్సవ యజ్ఞఫలం లభించాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీఈ శ్రీ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, శ్రీవారి సేవకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.































