ASWA VAHANA SEVA HELD _ అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్య కటాక్షం

Tirumala, October 19, 2026: Tirumala, 19 October 2026: The final among various Vahana Sevas of Srivari Navaratri Brahmotsavams, the divine Aswa Vahana Seva was held with devotion on Monday evening.

Sri Malayappa Swamy in Kalki Avataram has given a divine darshan to His  devotees atop the resplendent Ashwa Vahanam.

According to sacred Hindu scriptures, the horse represents the senses. The human body is likened to a chariot, the intellect to the charioteer, the mind to the reins, and the senses to horses. 

The Supreme Almighty is the divine force that controls these restless senses. Therefore, the darshan of the Lord atop the Ashwa Vahanam signifies restraining the wandering senses and installing the Paramatma in one’s heart.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దివ్య కటాక్షం

కలిదోషాల నివారణ.. ధర్మరక్షణకు కల్కి అవతార సందేశం

భక్తజనుల భజనలు, కోలాటాలు.. కర్పూర హారతులతో ఆధ్యాత్మిక వైభవం

తిరుమల, 2026 అక్టోబరు 19: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

గజరాజుల గంభీర నడకలు, మంగళవాయిద్యాల మధురనాదాలు, భక్తజనుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోషతో అశ్వవాహన సేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు

అశ్వవాహనం.. ఇంద్రియ నిగ్రహానికి సంకేతం

సనాతన ధర్మంలో అశ్వం వేగానికి, శక్తికి, చైతన్యానికి ప్రతీక. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోల్చి, వాటిని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను బోధించాయి. అశ్వవాహనంపై విహరించే శ్రీమహావిష్ణువు సమస్త ఇంద్రియాలకు నియామకుడని, మనిషి తన ఇంద్రియాలను నియంత్రించుకుంటూ ధర్మమార్గంలో పయనించాలని ఈ వాహనసేవ ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది.

కల్కి అవతారం.. అధర్మంపై ధర్మ విజయం

కలియుగంలో అధర్మాన్ని రూపుమాపి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించే శ్రీమహావిష్ణువు కల్కి అవతార స్వరూపాన్ని ఈ అలంకారం స్ఫురింపజేస్తుంది. కలిదోషాలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణ, నామసంకీర్తన, ధర్మాచరణను ఆశ్రయిస్తే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చనే సందేశాన్ని స్వామివారి అశ్వవాహన సేవ భక్తులకు అందిస్తుంది. ధర్మరక్షణ, దుష్టశిక్షణ, శిష్టరక్షణలో పరమాత్మ సంకల్పాన్ని స్మరింపజేస్తూ భక్తులలో భక్తి, ధర్మనిష్ఠలను పెంపొందిస్తుంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ ప్రభల గోపీనాథ్, బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ పూర్ణ సాంబశివరావు, శ్రీ ఆనంద్ సాయి, శ్రీ నరేష్ కుమార్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.