AGAMAS ARE MEANT FOR THE WELFARE OF THE HUMANITY-MANTRALAYA MUTT SEER _ సకలమానవ శ్రేయస్సే ఆగమశాస్త్ర ఉద్దేశం : శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు
సకలమానవ శ్రేయస్సే ఆగమశాస్త్ర ఉద్దేశం : శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు
తిరుపతి, 2012 జూలై 03: సకలమానవ శ్రేయస్సే ఆగమశాస్త్ర ప్రధాన ఉద్దేశమని మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు పరమపూజ్య 1008 శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మంగళవారం ఉదయం చతురాగమ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు అనుగ్రహభాషణం చేశారు.
ఈ సందర్భంగా స్వామివారు తమ సందేశాన్ని వినిపిస్తూ ఆగమాలను భారతీయ సంస్కృతిలో వారసత్వ సంపదగా భావించాలన్నారు. ఆగమ పండితులు సామాన్య ప్రజలకు సుఖ సంతోషాలు సిద్ధించేందుకు కృషి చేయాలన్నారు. మన పూర్వీకులు ఆగమాల పేరిట ఒక సక్రమమైన మార్గాన్ని సూచించారని, ఆ మార్గాన్ని మారిస్తే లక్ష్యాన్ని చేరుకోలేమని వివరించారు. సామాన్యప్రజల ఉద్ధరణ కోసమే వైఖానస, పాంచరాత్ర, శైవ, వైదికస్మార్త ఆగమాలు అవతరించబడ్డాయన్నారు.
ఆగమాలంటే సాక్షాత్తు పరబ్రహ్మ సాక్షాత్కార స్వరూపానికి తార్కానాలని ఆయన తెలిపారు. ఆ వేంకటేశ్వరుడు నిరంతరాయంగా జనజీవన కళ్యాణాన్ని చేస్తూ జీవకోటిని రక్షిస్తున్నాడని చెప్పారు. మనిషి జీవితంలో ఎప్పుడైతే నేను అనే భావన కలుగుతుందో అప్పటినుంచే పతనం మొదలవుతుందని, సృష్టి అంతా భగవంతుడు నిండి ఉన్నాడని వెల్లడించారు. విశ్వమానవ సంస్కృతికి భారతీయ సంస్కృతి మూలమని, ఆ భారతీయ జీవనానికి మూలం దాంపత్య బంధమని తెలిపారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అంటూ తల్లిదండ్రులు, గురువులు, అతిథులకు మన శాస్త్రాలు ఉన్నతస్థానం కల్పించాయన్నారు. ఉదయం లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించి భోజనతీర్థాలు స్వీకరించే ఉన్నతమైన సంస్కృతి భారతీయులకు సొంతమన్నారు. జగద్గురువైన శ్రీ గురురాఘవేంద్రస్వామి, జగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కొలువై ఉన్నారని, ఈ రకంగా ఆంధ్రులు చాలా అదృష్టవంతులని అన్నారు. ప్రజలు మమ్మీ-డాడీ సంస్కృతిని వదిలిపెట్టి మాతా-పిత సంస్కృతికి మరలాలన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రసంగిస్తూ ఈ సదస్సులో నాలుగు ఆగమాల పండితులు కలిసి చర్చించి తిరుమలలో దర్శన విధానాన్ని మరింత మెరుగుపరించేందుకు ఒక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మారుతున్న కాలపరిమితులకు అనుగుణంగా ఆగమాల ద్వారా ఎంత సమర్థవంతంగా ఫలితాలు పొందవచ్చు అనే విషయాలపై పండితులు దృష్టి పెట్టాలన్నారు.
తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ ప్రసంగిస్తూ యువత మంచిని బోధించే మన పురాతన భారతీయ సంస్కృతిని వదిలి చెడును వ్యాప్తి చేస్తున్న పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్నారని పేర్కొన్నారు. విదేశీయులు మాత్రం మన సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించారు. ఈ సదస్సు ఆగమశాస్త్రాలపై సామాన్య ప్రజానీకంలో కూడా సరైన అవగాహన తీసుకొచ్చి సానుకూలమైన సూచనలు, సలహాలు అందించాలని ఆయన కోరారు.
అంతకుముందు శ్వేత సంచాలకులు డాక్టర్ కె.వి.రామకృష్ణ, తితిదే వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణుభట్టాచార్యులు ప్రసంగించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదులవారు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శ్రీశ్రీశ్రీ సుయతీంద్రతీర్థ శ్రీపాదుల వారికి తిరుమల శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేసి ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైఖానస, పాంచరాత్ర, శైవ, వైదికస్మార్త ఆగమాల పండితులు, అర్చకులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.