ANANDA NILAYAM-THE HEAVEN ON EARTH_ ఆనందనిలయ విమాన వైశిష్ట్యం

Tirumala, 18 Sep. 19: Ananda Nilayam, is being described as the “Abode of Happiness” and the Resident is the most charming Lord Venkateswara who attracts tens of thousands of devotees every day with His bewitched divine beauty.

VIMANA VENKATESWARA

As the Lord resides in Ananda Nilayam, His devotees fondly call him as Vimana Venkateswara who stays in the three-tired canopy.

The first mention of Vimana is from the renovation work of the temple between the 12th and 13th century AD by the Pandyan King, Jatavarman Sundara Pandyan who gold-plated the roof and donated the gilded Kalasam.

Later Viranarasingaraya, a Pallava-allied king performed Thulabharam (weighing oneself) against gold; his weight in gold was used to make the gold-plated copper sheets to cover the Vimana. This phase of construction is usually agreed as the fourth phase of Tirumala temple construction out of seven.

1950s Renovation

In the 1950s, TTD decided to replace the aging metal and fix the roof.
All the gold was removed and the damaged levels of the roof below.
It took five years for the carpenters and builders to replace the long nails of the 10th century AD with solid cement and metal grouting using 20th century construction techniques. The copper plates were then installed and fixed in place. Fine “Aparanji” (the best quality) gold was chiselled into plates and riveted onto the copper plates.

ASTABANDHANA BALALAYA MAHA SAMPROKSHANAM IN 1964

A grand ceremony of sanctifying the new grand, golden Ananda Nilaya Vimanam took place in 1964 with “Ashta Bandhana Maha Samprokshanam”. The ceremony has been repeated ever since once every 12 years to undertake repairs in the temple.

64 DEITIES ENGRAVED

It is believed that there are 64 deities of Hindu religion including Hayagreeva, Yoganarasimha, and Lakshmi Devi etc. who are engraved on the Vimana Gopuram.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం

ఆనందనిలయ విమాన వైశిష్ట్యం

తిరుమల, 2019 సెప్టెంబరు 18: తిరుమ‌ల‌లో 0అర్చావతారమూర్తి అయిన శ్రీవేంకటేశ్వరుని ఆవాసమే ఆనందనిలయం. దాని భౌతిక స్వరూపమే విమానం. అందువల్ల తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని గర్భగుడి మీద గల సువర్ణమయ నిర్మాణాన్ని ఆనందనిలయ విమానం అంటారు.

విష్ణుదేవుని ఆన మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసికొని వచ్చినట్లు, దానిని సువర్ణముఖరీనదికి ఉత్తరం వైపున్న శేషాచల కొండలలో ప్రతిష్ఠించినట్లు ఆ క్రీడాద్రి మీద భూవరాహస్వామి శ్వేతవరాహకల్పం నుంచి నివసిస్తున్నట్లు అనేక పురాణాలు పేర్కొన్నాయి.

శ్రీ వేంకటాచలమాహాత్మ్యంలో ఇలా ఉంది..

భవిష్యోత్తర పురాణాన్ని ఉదహరిస్తూ శ్రీ వేంకటాచలమాహాత్మ్యం గ్రంథంలో ఒక కథ ఉంది – ఒక రోజు వాయుదేవుడు ఆదిశేషునితో వాదిస్తూ పందానికి దిగాడు. పందెం ప్రకారం ఆదిశేషుడు మేరుపర్వత పుత్రుడైన ఆనందపర్వతాన్ని చుట్టుకొన్నాడు. అతనిని కదలించడానికి వాయుదేవుడు తన సామర్థ్యం అంతా వినియోగించినా వీలుకాలేదు. చివరకు శేషునితో ముడిపడిన ఆనందాద్రిని భూలోకంలో సువర్ణముఖరీనది ఉత్తర ఒడ్డుకు తోశాడు. శేషుడు పశ్చాత్తాపంతో శేషాచలపర్వతంగా రూపొందాడు. ఆతని శిరస్సు మీద ఆనందపర్వతం ఆనందనిలయ విమానంగా మారిపోయింది. ఇది ఆనందనిలయ విమానపుట్టుక రహస్యం.

బ్రహ్మానందం కలిగించేది..

ఆనందాద్రి పరమానందం బ్రహ్మానందం కలిగించేది. ఆ కొండపై ఋషులు తపమాచరించి ఆనందమే పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకొంటున్నారని తెలియజేసింది. అందుకే ఈ పుణ్యాద్రిని వైకుంఠంకంటే మిన్నగా భావించాడు ఆ దేవదేవుడు.

దివ్యమైన ఆనందనిలయ విమానం కోటి సూర్యకాంతి సమమైన రత్నస్తంభాలచే నిర్మింపబడిన మహామణిమండపము కలిగి ఉంది. అందులో శంఖచక్రధరుడైన శ్రీనివాసుడు దేవదేవుడై నిలిచియున్నాడు. ఈ ‘మహామణిమండపం’ అను పేరును ఈ పురాణం నుండి గ్రహించిన చంద్రగిరి మాధవదాసర్‌(మల్లనమంత్రి) బంగారువాకిలి ముందు మండపం నిర్మించినపుడు(క్రీ.శ.25-8-1417) దానికి వాడుకున్నాడు. అందువల్ల అది మహామణి మండపమైంది. విఖనస మహర్షి శిష్యుడైన మరీచి విమానసహిత దేవాలయంలోని మూర్తిని పూజించడం అత్యుత్తమమైందని సెలవిచ్చాడు.

ఎవరు నిర్మించారు..

తిరుమలలో శ్రీనివాసమూర్తి కోరిన ప్రకారం తొలి ఆనందనిలయ విమానాన్ని ‘మరీచిసంహిత’ ననుసరించి తొండమానుచక్రవర్తి నిర్మించినట్టు తెలుస్తోంది. అదే తొలి ఆలయం. చారిత్రకాంశాలకు వస్తే వేరువేరు కాలాలలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, శ్రీమంతులు ఆలయాన్ని అభివృద్ధిపరచి జీర్ణోద్ధార‌ణ‌ చేసిన వైనం తెలుస్తుంది.

ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాలన్నిటిలోకి క్రీ.శ.1250- 55 సం||లలో జరిగిన మరమ్మతు కార్యక్రమం ముఖ్యమైంది. తిరుప్పుల్లానిదాసర్‌ అనే అతడు వీరనరసింగయాదవరాయల అనుమతితో జీర్ణోద్ధరణకు పూనుకున్నాడు. పాతశాసనాలన్నిటినీ కాపీచేసి పెట్టుకుని జీర్ణోద్ధరణ తరువాత కొత్త నిర్మాణాల మీద యథాతథంగా వాటిని పూర్వస్థానాల మీద తిరిగి చెక్కించే షరతు విధించి యాదవరాయలు అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా జీర్ణోద్ధరణ జరిగింది. పాతశాసనాలను రక్షించారు.

దీనిని తు.చ. తప్పకుండా నిర్వహించిన తిరుప్పుల్లాని దాసర్‌ను అభినందించి, ఆతనినే ఆదర్శంగా తీసికొని తానుకూడా తులాభారంలో తనను తూచమని తన యెత్తు బంగారం ఆలయానికి ఇచ్చి ఆనందనిలయ విమానానికి బంగారుమలామా చేయించమన్నాడు వీరనరసింగదేవ యాదవరాయలు. ఆ విధంగా ఆలయంలో తులాభారం వేయడం తొలుత ప్రవేశపెట్టబడింది. తొలిసారి బంగారుమలామా ఆనందనిలయ విమానానికి దక్కింది. అంతేకాదు అప్పుడే దర్శనానికి వచ్చిన పాండ్యచక్రవర్తి మొదటి జటాదర్శన్‌ సుందరపాండ్యుడు తన ఉభయంగా ఆ విమానం మీద బంగారు కలశం పెట్టడం కూడా జరిగింది. ఇన్ని విశేషాలతో కూడిన ఆ శిలా శాసనాలు (పాత) మొదటి శా.సం.లో 49, 91 శాసనాలుగా ఉన్నాయి.

రాజవంశీయుల సేవ..

చంద్రగిరికోటలో ఉన్న రంగనాథ యాదవరాయల తరువాత సాళువ మంగిదేవుడు తాను రాజై విజయనగర సంగమ వంశరాజులకు సామంతుడుగా మారినప్పుడు తిరుమల ఆలయాన్ని దర్శించాడు. ఆనందనిలయ విమానం కళావిహీనమై కనబడింది. వెంటనే దానికి బంగారుపూత పూయాలని ఆదేశించాడు. క్రీ.శ. 1361 సం|| నాటి ఈ సంఘటన తెలుగులో శాసనబద్ధమైంది. (తిరుమల తిరుపతి దేవస్థాన శాసనసంపుటి 1, నం.179,180) తిరుమల ఆలయంలో మొట్టమొదటి తెలుగుశాసనం ఇదే. దాదాపు 50సం||ల తర్వాత రెండవ దేవరాయల మంత్రి- అమాత్యశేఖర మల్లన లేదా చంద్రగిరి మాధవదాసర్‌ క్రీ.శ. 25-8-1417లో తిరిగి బంగారు పూత పూయించాడు. ఈ తారీఖున ఆయన బంగారువాకిలి ముందు మహామణిమండపాన్ని నిర్మించాడు కావున అప్పుడే విమాన జీర్ణోద్ధరణ చేసి ఉంటాడని అంచనా. అసలు శాసనం కొంత శిథిలమైంది. కానీ అందులో మొట్టమొదటిసారిగా ‘ఆనందవిమానం’ అను పేరు కనబడింది. (తిరుమల తిరుపతి దేవస్థాన శాసనసంపుటి 1, నం.196, 198) 100 సం||ల తర్వాత క్రీ.శ. 9-9-1518 సం||లో శ్రీకృష్ణదేవరాయలు 30 వేల వరహాలు చెల్లించి బంగారుమలామా చేయించాడు. (తిరుమల తిరుపతి దేవస్థాన శాసన సంపుటి.3 నం.81)

ఐదవసారి కాంచీపురానికి చెందిన కోటి కన్యాదానము లక్ష్మీ కుమార తాతాచార్యులు క్రీ.శ.1630 సంవత్సరం రెండవ వెంకటపతిరాయల కాలంలో బంగారుపూత పూయించగా, ఆరవసారి మహంత్‌ ప్రయోగదాస్‌జీ కాలంలో ఆయన సోదర శిష్యుడు అధికార రామలక్కన్‌దాస్‌ క్రీ.శ. 1909లో బంగారుమలామా చేయించాడు. తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలలో ఇదే చిట్టచివరి శిలాశాసనం.

1958లోను, 2006, 2018వ సం||లోను తిరుమల తిరుపతి దేవస్థానంవారు స్వయంగా ఆనందనిలయ దివ్యవిమానానికి స్వర సొబగులు దిద్ది సంప్రోక్షణలు చేశారు. ఈ విధంగా ఇప్పటికి 9 పర్యాయాలు ఆ దివ్యవిమానం మరమ్మతులు పొంది పవిత్రీకరింపబడింది.

ఆనందనిలయం శ్రీవారికి ఆవాసం మాత్రమే కాదు ఆపన్నులపాలిటి కొంగుబంగారం. ఆపదమొక్కులవారంతా ఆ విమానం చుట్టూ అంగప్రదక్షిణ చేసి ఇష్టసిద్ధిని పొందుతుంటారు. అన్ని ఉత్సవాలు, అభిషేకాలు విమాన ప్రదక్షిణతోనే ఆరంభమౌతాయి. ఏ కారణం చేతనైనా ఆలయంలో అసలు స్వామిని దర్శించలేనప్పుడు అసలు స్వామిని పోలిన విమాన వేంకటేశ్వరుని దర్శించి ఆత్మసంతృప్తి పొందడం అనాదిగా వస్తున్న ఆచారమైంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.