ANIVARA ASTHANAM AT SRIVARI TEMPLE ON JULY 17_ జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
June 23, 2019: TTD plans to conduct Koil Alwar Thirumanjanam on July 16, ahead of holy event of Anivari Asthanam on July 17 at the Srivari temple in Tirumala.
The festival is conducted every year on Dakshinayana Punya Kalam, on Sankranti as tagged in Karnataka, but as per Tamil calendar it as fag end month event and hence called Anivari Asthanam as it is celebrated in Tamil month of Ani. In other words, it is a festival of annual budget as per agama tradition.
As part of the event, utsava idols of Lord Malayappaswamy and his consorts will be worshipped at Bangaru Vakili along with Viswaksena. The ritual also marks the presentation of Silks by the Jeeyar swamiji of the Tirumala to the deities.
Later in evening of July 17 the utsava idols will be grandly taken out in flower decorated palanquin on mada streets.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
జూన్ 23, తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. ఇందుకోసం జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
చారిత్రక నేపథ్యం
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఉత్సవ విశిష్టత
ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ
శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచుతారు.
పుష్ప పల్లకీపై ఊరేగింపు
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.