ANKURARPANA FOR NAVARATRI BRAHMOTSAVAMS ON OCTOBER 11 _ అక్టోబరు 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirumala, 10 October 2026: Ankurarpanam or Beejavapanam-the festival of prelude for Navahnika Navaratri Brahmotsavams, will be performed on Sunday, October 11.
The rituals includes Senadhipathi Utsavam where in the divine commander in chief, Sri Vishwaksena parades along mada streets surrounding Tirumala temple to supervise the ongoing arrangements for mega religious fete, which is followed by Medini Puja, where the divine mother Earth is being worshipped and finally Ankuraropanam or Ankurarpanam or Beejavapanam.
In this nine seedlings are being sown in nine mud pots-Palikas under the moon light. The germination of these seedlings represents the successful conduct of the Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అక్టోబరు 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల, 2026 అక్టోబర్ 10: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 11వ తేదీ ఆదివారం అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం ….
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
మేదినిపూజ….
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.
అంకురార్పణ….
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ…
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.
