ANKURARPANA HELD FOR ANNUAL PAVITROTSAVAMS _ శ్రీవారి ప‌విత్రోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUMALA, 17 AUGUST 2021: The Ankurarpana was held for the annual Pavitrotsavams which are scheduled from August 18 to 20 in Tirumala temple on Tuesday evening.  

In the morning, Acharya Ritwik Varanam was held in front of Moola Virat in the Sanctum Sanctorum of the temple and duties were allotted to the Acharyas who will be carrying out the rituals on all these days. 

In the evening, Viswaksena – the Commander in Chief of Sri Venkateswara Swamy was taken to Vasantha Mandapam in a procession and Mritsangrahanam and Asthanam were performed. Later the deity was returned to the temple and Ankurarpana was held in the Yagasala in Tirumala temple as per Vaikhana Agama in accordance with Covid guidelines. 

According to available inscriptional evidence, the Pavitrotsavam was first performed in 15 and 16 centuries and revived in 1962 by TTD and are also known  as “Sarva Dosha Upasamana” or “Dosha Nivarana” Utsavams, The unique feature of this festival is that garlands made out of silk or cotton threads are  prepared in five colours viz. White, Black, Green, Yellow, Red and will be decorated to the utsava idols on this celestial occasion.  

Additional EO Sri AV Dharma Reddy, Deputy EO Sri Ramesh Babu, Peishkar Sri Hari were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీవారి ప‌విత్రోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమల, 2021 ఆగ‌స్టు 17: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల‌కు మంగ‌ళ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతల కేటాయింపునే ఋత్విక్‌వ‌ర‌ణం అంటారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

శ్రీవారి పవిత్రోత్సవాలకు మంగ‌ళ‌వారం రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణం జరుగనుంది. ముందుగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సేనాధిపతివారిని ఆల‌యం నుండి వ‌సంత‌మండ‌పంలోకి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత తిరిగి ఆల‌యానికి చేరుకుని పవిత్రమండపంలోని యాగశాలలో అంకురార్ప‌ణ వైదిక కార్యక్రమాలు చేపడతారు.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌రకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

దోష నివారణ ఉత్సవాలు :

పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్టికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.

పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. ”పవిత్ర తిరునాల్‌” పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.