ANKURARPANAM FOR NARAYANAVANAM BRAHMOTSAVAMS ON MAY 27 _ మే 27న నారాయణవనం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ANNUAL BRAHMOTSAVAMS OF SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE FROM MAY 28 TO JUNE 5

Tirupati, May 26, 2026: Narayanavanam stands as the sacred venue of the divine celestial wedding of Sri Padmavati and Srinivasa

Lord Srinivasa blesses devotees with marital harmony and family prosperity

Sacred 2500-year-old grinding stone remains a spiritual attraction

Ankurarpanam for the annual Brahmotsavams of Sri Padmavati Sametha Sri Kalyana Venkateswara Swamy Temple at Narayanavanam will be held on May 27 at 7.30 PM. The annual festivities will take place from May 28 to June 5 with religious fervour.

The temple is renowned for blessing devotees with marital harmony, peace and prosperity. Thousands of devotees from Andhra Pradesh, Tamil Nadu and Karnataka visit the temple seeking the divine grace of Lord Kalyana Venkateswara Swamy.

According to temple legend, Narayanavanam is the sacred place where Lord Srinivasa married Goddess Padmavati in the presence of celestial beings. 

The temple also houses a sacred 2500-year-old grinding stone believed to have been used during the divine wedding rituals.

The temple, known for its magnificent Rajagopuram, ancient mandapams and sub-shrines, was merged with TTD in 1967. 

Daily rituals, special sevas and grand annual festivals are being conducted under TTD administration.

Free Annaprasadam is served daily to devotees visiting the temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

మే 27 నారాయణవనం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మే 28 నుండి జూన్ 05 వరకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు

శ్రీ పద్మావతిశ్రీనివాసుల పవిత్ర కల్యాణానికి నిలువెత్తు సాక్ష్యం నారాయణవనం

కళ్యాణ కటాక్షంతో భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీనివాసుడు

కుటుంబ సౌఖ్యం ప్రసాదించే శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

2500 ఏళ్ల తిరగలిలో సజీవంగా నిలిచిన దివ్య కళ్యాణ ఘట్టం

తిరుపతి, 2026 మే 26: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 05వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో మే 27వ తేదీ రాత్రి 07.30 గం.లకు అంకురార్పణ  జరుగనుంది. ఈ సందర్భంగా స్వామి వారిని ఉదయం 06 గం.లకు సుప్రభాతంతో మేల్కొలిపి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

ఆలయ ప్రాముఖ్యత

శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య దర్శనం దంపతుల జీవితాల్లో సుఖశాంతులు, పరస్పర అవగాహన, కుటుంబ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు, కొత్తగా వివాహమైన దంపతులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు స్వామివారి కళ్యాణ కటాక్షం కోసం ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

“శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి”గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. దాంపత్య జీవితంలో ఆనందం, అనురాగం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం భక్తులు స్వామివారిని ప్రార్థిస్తుంటారు. శ్రీనివాసుని కళ్యాణ మహిమ జీవితాలను మంగళమయం చేస్తుందనే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు నారాయణవనానికి తరలివచ్చి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు.

స్థల పురాణం :

పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఆకాశరాజు పరిపాలించిన రాజధానిగా నారాయణవనం వెలుగొందింది. ఇదే పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారితో దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నాడని స్థల పురాణం వివరిస్తోంది. ఆ దివ్య వివాహ ఘట్టానికి చిరస్మరణగా పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం కల్యాణ మహిమను ప్రసరించే పవిత్ర దివ్యక్షేత్రంగా యుగయుగాలుగా భక్తుల ఆరాధనలను అందుకుంటోంది.

గర్భాలయం :

దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు ప్రాకారాలతో విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. తొలి ప్రాకారంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు దివ్య మంగళవిగ్రహంతో భక్తులకు దర్శనమిస్తుండగా, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, ఉప సన్నిధులు ఆలయ మహిమను మరింత పెంపొందిస్తున్నాయి.

గోపురాలు :

ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులకు దివ్య దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహోన్నత రాజగోపురం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. సుమారు 150 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకేలా నిర్మితమైన ఈ ప్రధాన గోపురాన్ని విజయనగర సామ్రాజ్య మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడు అంతస్తులతో కళాత్మకంగా నిర్మించిన మధ్య గోపురాన్ని శ్రీ వీర నరసింహదేవరాయలు నిర్మించగా, దాని శిల్పసౌందర్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పవాటికలతో అలరారే రెండవ ప్రాకారమైన తోట ప్రాకారం ఆధ్యాత్మిక ప్రశాంతతను పంచుతూ భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తోంది.

మండపాలు :

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని మహా మండపం, ముఖ మండపం, అంతరాలయ మండపం, గర్భాలయ మండపం, వాహన మండపం, పదహారు కాళ్ల మండపం అద్భుత శిల్పకళా వైభవంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి స్తంభం, ప్రతి శిల్పం వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ, ఈ మండపాలలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడూ అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, దివ్యానుభూతిని ఆస్వాదిస్తారు.

ఉప ఆలయాలు :

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వెలసిన ఉపాలయాలు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక మహిమను మరింత పెంపొందిస్తున్నాయి. శ్రీ పరాశరేశ్వరస్వామి, శ్రీ భక్తాంజనేయస్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి, శ్రీ శక్తి వినాయకస్వామి, శ్రీ అగస్తీశ్వరస్వామి, శ్రీ అవనాక్షి అమ్మవారి ఆలయాలు భక్తులకు దివ్య దర్శనమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నాయి. అలాగే భక్తులు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదించేలా దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న పద్మ సరోవరం ఈ క్షేత్రానికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తోంది.

2500 సంవత్సరాల నాటి తిరగలి :

ఈ దివ్యక్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి చిరస్మరణీయ సాక్ష్యంగా నిలిచింది సుమారు 2500 సంవత్సరాల నాటి పవిత్ర తిరగలి. శ్రీ పద్మావతి అమ్మవారు – శ్రీనివాసుల దివ్య కళ్యాణ మహోత్సవంలో నలుగు పిండి తయారీకి ఉపయోగించిన ఈ తిరగలి నేటికీ భక్తుల్లో అపారమైన భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగిస్తోంది.

దర్శనంసేవలు :

భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని పరిపుష్టం చేసే విధంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే నిత్యకైంకర్యాలలో తోమాల సేవ, అర్చన భక్తులను భక్తి పరవశ్యంలో ముంచెత్తుతాయి. రాత్రి 8 గంటలకు నిర్వహించే ఏకాంతసేవలో స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. ప్రతి శుక్రవారం పవిత్ర అభిషేకం, మంగళవారం అష్టదళ పాద్మారాధన సేవలు విశేష భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతూ భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదిస్తున్నాయి.

ఉత్సవాలు :

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలను టిటిడి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. వైకుంఠ ద్వాదశి, శ్రీ పద్మావతి అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయం విద్యుద్దీపాలతో, పుష్పాలంకరణలతో దివ్యంగా అలంకరించబడుతూ భక్తులకు కనులపండువగా నిలుస్తుంది.

ప్రసాదాలు :

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారికి సమర్పించే నైవేద్య ప్రసాదాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తాయి. ప్రతిరోజూ పొంగలి, పులిహోర, పెరుగన్నం, దోసె వంటి ప్రసాదాలతో పాటు కళ్యాణోత్సవ సందర్భంలో ప్రత్యేకంగా చక్కెర పొంగలిని భక్తులకు అందజేస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో సీరా, మిర్యాల పొంగలి, సుగీలు, వడలు, వడపప్పు, పానకం, అప్పం, లడ్డూ వంటి సంప్రదాయ ప్రసాదాలు స్వామివారి కృపాప్రసాదాలుగా భక్తులకు పంపిణీ చేస్తారు.

1967లో టిటిడిలో విలీనం :

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో అనాదిగా భక్తుల మన్ననలను అందుకుంటోంది. పూర్వం ఈ దేవాలయం మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేది. అనంతరం తమిళనాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కైంకర్యాలు కొనసాగగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ దేవాదాయ శాఖ నిర్వహణలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

తదుపరి 1967 ఏప్రిల్‌ 29న ఈ పవిత్ర ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం కావడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. టిటిడి ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత ఆలయ వైభవం మరింత విస్తరించి, నిత్యకైంకర్యాలు, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించబడుతున్నాయి. టిటిడి ప్రత్యేక శ్రద్ధతో ఆలయ ఆధ్యాత్మిక మహిమ భక్తులకు మరింత చేరువైంది.

భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు :

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సహకారంతో ప్రతిరోజూ మధ్యాహ్నం రుచికరమైన ఉచిత అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు.  “అన్నదానం మహాదానం” అనే సనాతన ధర్మ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ సేవ భక్తుల హృదయాల్లో విశేష ఆనందాన్ని నింపుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.