అన్నమయ్య జయంతి ఉత్సవాలలో ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం

అన్నమయ్య జయంతి ఉత్సవాలలో ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం

తిరుపతి, 2018 మే 4: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఆరో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన నృత్య, గాత్ర కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా వినాయక ప్రార్థన, అదివో అల్లదివో కీర్తనలకు కుమారి పి.అవ్యక్త చేసిన నృత్యం ఆకట్టుకుంది.

అన్నమయ్య జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఎస్.ప్రద్యుమ్న హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలపట్ల ప్రావీణ్యం పెరిగితే ప్రతిఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.

అనంతరం చెన్నైకి చెందిన ఎస్.జె.జననీ గాత్ర సంగీతం, విశాఖకు చెందిన పి.ఎస్.ఎస్.శ్రావణి నృత్యకార్యక్రమం ఆకట్టుకుంది.

ఉదయం అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు నిర్వహించిన గాత్ర సంగీత కార్యక్రమానికి విశేషస్పందన లభించింది.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎం. శ్రీనివాస్ బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఆ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ ధనుంజయులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.