ANNAMAYYA VARDHANTHI ON APRIL 1_ ఏప్రిల్‌ 1న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

METLOTSAVAM ON MARCH 31

Tirumala, 13 March 2019: In connection with 516th Death Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya, Metlotsavam will be observed on March 31 at Alipiri under the aegis of Annamacharya Project.

While on April 1, there will be Sapthagiri Sankeertana Goshti Ganam in Narayanagiri Gardens. HH Sri Ranganatha Yateendra Mahadesikan Swamiji of Annamacharya dynasty will render religious discourse.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 1న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

తిరుమల, 2019 మార్చి 13: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్ధంతి తిథి ద్వాదశిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 1వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం ఘనంగా జరుగనుంది. శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు.

శ్రీ అన్నమాచార్య గురుపరంపరకు చెందిన శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ విచ్చేయనున్నారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌తోపాటు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీమ‌తి శ్రీ‌నిధి, కుమారి అన్న‌పూర్ణ మ‌ధులిత‌ పాల్గొంటారు. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు, భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మార్చి 31న అలిపిరిలో మెట్లోత్సవం

శ్రీ తాళ్లపాక అన్నమయ్య 516వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 31వ తేదీ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 5.30 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. టిటిడి ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ప్ర‌ముఖ విద్వాంసుల‌తో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 2, 3వ తేదీల‌లో తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్త‌న‌ల‌పై విశేష కృషి చేసిన దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్రముఖ విద్వాంసుల‌తో జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.