ANNUAL VASANTHOTSAVAM COMMENCES _ శోభాయ‌మానంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

TIRUMALA, 03 APRIL 2023: The Annual Vasanthotsavam commenced on a grand religious note in Tirumala on Monday.

 

Usually Vasanthotsavam is performed in Tirumala during the auspicious days of Trayodasi, Chaturdasi and Pournami in the month of Chaitra (March/April) every year.

According to the temple Legend, the Vasanthotsavam Festival was started during the period of King Achyutaraya in 1460’s.

 

This annual fete was believed to have introduced by the King to mark the arrival of Spring Season. Srivaru and His Consorts are given aromatic bath on Monday giving a soothing relief to the deities from the scorching Sun.

 

Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi were brought to beautifully decorated Vasanta Mandapam. Snapana Thirumanjanam with aromatic ingredients) is performed to the deities by one of the Pradhana Archakas Sri Venugopala Deekshitulu.

Both the senior and junior pontiffs of Tirumala, EO Sri AV Dharma Reddy, CEO SVBC Sri Shanmukh Kumar, Temple DyEOl Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, Garden Deputy Director Sri Srinivasulu and others were present.

Devotees also participated.

 

‘SPRING’ FOREST RECREATED: The vasanta mandapam has been decorated matching the occasion. The colourful flora and fauna of Seshachala ranges has been recreated by Garden wing of TTD.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శోభాయ‌మానంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

– శేషాచలాన్ని తలపించిన వసంతమండపం

తిరుమల, 2023 ఏప్రిల్ 03: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం శోభాయ‌మానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే ప‌లుర‌కాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు.

ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

శేషాచలాన్ని తలపించిన వసంతమండపం

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో వ‌సంత‌మండ‌పాన్ని శేషాచల అడవులను త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం 250 కేజిల వట్టి వేరు, 500 కేజిల సాంప్రదాయ పుష్పాలు, 10 వేలు కట్ ఫ్లవర్స్ తో సుందరంగా రూపొందించారు. ప‌చ్చ‌ని చెట్లు, పుష్పాలతోపాటు ప‌లుర‌కాల జంతువుల ఆకృతులను ఏర్పాటుచేశారు. వీటిలో పులి, చిరుత‌, కోతులు, పునుగుపిల్లి, కొండ‌చిలువ‌, కోబ్రా, నెమ‌లి, హంస‌లు, బాతులు, హ‌మ్మింగ్ బ‌ర్డ్‌, మైనా, చిలుక‌లు ఉన్నాయి. ఇవి భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఏప్రిల్ 4న స్వర్ణరథోత్సవం…

వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 4న ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్,
ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.