ANNUAL VASANTHOTSAVAM IN TIRUMALA FROM MARCH 27 TO MARCH 29 _ మార్చి 27 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు
మార్చి 27 నుంచి 29వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వసంతోత్సవాలు
తిరుమల, 2010 మార్చి 03: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి మార్చి 27వ తేది నుంచి 29వ తేది వరకు వసంతోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రపూర్ణిమకు ముగిసేట్టులగా మూడు రోజుల పాటు తిరుమలలో వసంతోత్సవాలు జరగడం ఆనవాయితి.
ఈ వసంతోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజలసేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను మూడు రోజుల పాటు రద్దుచేసారు.
చైత్ర శుద్ద త్రయోదశి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఆలయానికి నైరుతి మూలలో వున్న నారాయణగిరి ఉధ్యానవనంలోని వసంత మండపానికి వేంచేపుచేసి వసంతోత్సవ అభిషేకాలు, నివేదన ఆస్థానాలు, వివిధ రకాల అభిషేకాలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. పిదప ఆలయాన్ని చేరుకొంటారు.
రెండవ రోజు శ్రీ మలయప్పస్వామి వారు బంగారు రథంపై తిరుమాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం ముందు రోజు మాదిరే వసంత మండపంలో వసంతోత్సవం జరుగుతుంది. మూడవ రోజు శ్రీమలయప్పస్వామితో పాటు రుక్మిణీ శ్రీకృష్ణులు, శ్రీసీతారామ లక్ష్మణులు కూడా వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ సాయంత్రం ఆలయానికి చేరుకొంటారు.
ఆర్జితంగా జరిగే ఈ వార్షిక వసంతోత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు రు.3000/- చెల్లించి 10 మంది పాల్గొనవచ్చును.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.