అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 5వ తేదీన ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబరు 6వ తేదీన ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 7వ తేదీన ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ ఈ. సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ కెఎల్‌. గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసరాజు, రాజేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.