BAKASURAVADHA HIGHLIGHTED ON MUTTANGI_ ముత్యపుపందిరి వాహనంపై బకాసురవధ అవతారంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి
Srinivasa Mangapuram, 26 Feb. 19: On the third day evening on Tuesday, Sri Kalyana Venkateswara Swamy took a celestial ride on Mutyapu Pandiri vahanam as Lord Krishna.
The episode of Lord Krishna killing demon Bakasura who comes in the guise of an evil giant crane. Lord flanked by His two consorts Sridevi and Bhudevi blessed devotees on Mutyala Pandiri vahanam on a pleasant evening.
Tirupati JEO Sri B Lakshmikantham, Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Superintendent Chengalrayulu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ముత్యపుపందిరి వాహనంపై బకాసురవధ అవతారంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి
తిరుపతి,2019 ఫిబ్రవరి 26: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసురవధ అవతారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, ప్రధాన కంకణబట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.