Bhakthi Chaitany Yatra _ తితిదే దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి చైతన్య యాత్ర
హరికథామృత సారము గ్రంధం హరిభక్తికే ఒక ప్రతిరూపం : సుఫ్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి డా.వెంకటాచలయ్య
తిరుపతి, ఆగష్టు -6, 2009: శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రియమైన భక్తుడైన శ్రీజగన్నాథదాసులవారు రచించిన హరికథామృత సారము అను గ్రంధం హరిభక్తికే ఒక ప్రతిరూపమని సుఫ్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి డా.వెంకటాచలయ్య అన్నారు. గురువారం ఉదయం స్థానిక అలిపిరినందు జరిగిన శ్రీజగన్నాథదాసుల ద్విశతమానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీజగన్నాథస్వామివారు గొప్ప కర్ణాటక విద్వాంసుడు, పండితుడని, ఆయన అనేక గొప్పకృతులను రచించాడని తెలిపారు. కన్నడంలో ఎంతో మంది పండితులు తమకృతులను, పాండిత్యాన్ని సంస్కృతంలో రచించారని, ఉపదేశించే వారని అయితే శ్రీజగన్నాథదాసులవారు తన రచనలు, ఉపదేశాలు పూర్తిగా స్థానిక భాషలో వుండడం వలన అవి జన సామాన్యంలో విశేష ఆదరణపొందాయని జస్టీస్ వెంకటాచలయ్య చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శ్రీహరికథామృత సారము నుండి కొన్ని శ్లోకాలను వినిపించారు.
తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె.ఆదికేశవులు మాట్లాడుతూ తిరుమలేశుని దర్శంచడానికి దేశవిదేశాల నుండి భక్తులు వస్తున్నారని, అదేవిధంగా కర్నాటకలో వుండే అనేక మంది స్వామివారిపై వేలాది కీర్తనలు వ్రాసి స్తుతించారని అట్టివారిలో శ్రీజన్నాథదాసులవారు పరమ పావనీయుడని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి తెచ్చిన జ్యోతిని ఈ చైతన్యరథంలో అమర్చడం జరిగిందని, ఈ రథం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రారతాలు తిరిగి చివరకు శ్రీజగన్నాథదాసులవారి ప్రాంతమైన మాన్వి అను ప్రాంతానికి ఈనెల 21న చేరుకుంటుందని తెలిపారు.
అదేవిధంగా ఈరథయాత్రలో భాగంగా ఆగస్టు 14వ తేదిన రథం బెంగుళూరు పట్టణం చేరుకుంటుందని, అక్కడ నేషనల్ గ్రౌండు నందు ఈ రథాన్ని కర్నాటక గవర్నరు, ముఖ్యమంత్రి వర్యులు సందర్శించి స్వామిని దర్శించుకుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీఐ.వై.ఆర్.కృష్ణారావు మాట్లాడుతూ భక్తి,భక్తిభావం హిందూధర్మానికి మూలస్థంబాలని తెలిపారు. భక్తికి భగవంతుడు లొంగుతాడని భాగవతం చెబుతున్నదని, సాధారణ భక్తి ద్వారా భగవంతుని తాథాత్మ్యం చెందవచ్చునని ఆయన తెలిపారు. ఈసందర్భంగా గజేంద్రమోక్షంలోని కొన్ని శ్లోకాలను, ప్రహ్లాదుడికి శ్రీహరిపై గల నిజభక్తిని, భీష్ముడు అంపశయ్యపై వున్నప్పుడు శ్రీకృష్ణుడి ఉపదేశంకు సంబంధించి కొన్ని శ్లోకాలను విన్పించారు. భక్తి భావాల్ని ప్రజలలోకి తీసుకువచ్చి, పరమ భక్తుల జీవిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తితిదే అవిరళ కృషి చేస్తుందని ఇఓ తెలిపారు.
అనంతరం శ్రీనివాస జ్యోతి రథయాత్రకు వారు పూజలు చేసి ప్రారంభించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.