హ‌నుమంత వాహనసేవలో 2 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హ‌నుమంత వాహనసేవలో 2 ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

సెప్టెంబరు 18, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం హ‌నుమంత వాహనసేవలో రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమ‌తి సుధా నారాయ‌ణ‌మూర్తి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

పురాణ వాఙ్మయం – డా. విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి

భారతీయ సంస్కృతిలో పురాణాలకు అత్యున్నత స్థానముంది. ఇవి భారతీయ జనజీవనాన్ని తీర్చిదిద్దుతాయి. సమాజానికి ధార్మిక తేజాన్ని కలిగిస్తాయి. దైవప్రీతిని, పాపభీతిని, సంఘనీతిని పురాణాలు ప్రబోధిస్తూ ప్రజలకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. పురాణాలలో లోకాంతర విషయాలేకాక భూగోళ, ఖగోళ విశేషాలు, నదీనదాలు, పర్వతాలు మున్నగువాటి వర్ణనలు, ఇహలోకానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆర్షవాఙ్మయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు పురాణాలపై విశేష పరిశోధన చేసిన డా.విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి గారిచే అష్టాదశ పురాణాల పరిచయాన్ని వ్రాయించి ఒక చిన్న పుస్తకంగా అందిస్తున్నది.

రామోపాఖ్యానం(భారత ఉపాఖ్యాన గ్రంథమాల)

మహాభారతంలోని అరణ్యపర్వంలోని ”రామోపాఖ్యానం” అనే ఈ ఉపాఖ్యానానికి డా|| నండూరి రామకృష్ణమచార్యులు గారు వ్యాఖ్యానాన్ని అందించగా డా||ఎ.గోపాలరావుగారు పీఠికను సంతరించారు. ఈ ఘట్టంలో సైంధవ పరాభం తరువాత కామ్యకవనంలో బ్రాహ్మణులతో కలిసి ఉన్న ధర్మరాజువద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. అతనితో ధర్మరాజు, ద్రౌపది జయద్రథుని వల్ల పొందిన అవమానాన్ని వివరించగా మార్కండేయుడు వారిని ఓదారుస్తూ రఘురాముడు పొందిన కష్టాలలో మీ కష్టం ఏపాటిది అనగానే ద్రౌపది శ్రీరాముని వృత్తాంతాన్ని తెలపమనడం మార్కండేయ మహర్షి శ్రీరామచంద్రుని కథను వారికి తెలియజేయడం ఇందులోని కథాంశాలు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.