భక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారం

భక్తులకు అందుబాటులో ”వేదం – జీవన విధానం” సరళమైన తెలుగులో వేదాల సారం

టిటిడి పుస్తక విక్రయశాలల్లో లభ్యం

తిరుపతి, 2017 నవంబరు 26: వేదాల్లో మానవ జీవన విధానం ఆ కాలంలో ఎలావుండేదో చక్కని సరళమైన తేట తెలుగులో వివరిస్తున్న గ్రంథమే ఈ ‘వేదం-జీవనవిధానం’. అన్ని వేదాలకు ధర్మమే మూలం అని మనుస్మ తి చెబుతుంది. ‘అన్ని వేదాలచేత తెలియబడేవాడిని నేనే’ అని శ్రీక ష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పాడు.

నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ నాలుగింటి సమాహార స్వరూపమే వేదం. వేదాల్లో చెప్పిన విషయాలు, ప్రజల దైనందిన జీవన విధానం ఎలా వుండేదో జనసామాన్యానికి తెలియజేయడానికి వారికి అర్థమయ్యే వాడుక భాషలో ఈ గ్రంథాన్ని రచించారు బ్రహ్మశ్రీ రేమెళ్ల సూర్యప్రకాశశాస్త్రి. ఇటీవల జరిగిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

ఈ గ్రంథం ధర రూ.135/-గా టిటిడి నిర్ణయించింది. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో ఈ గ్రంథం భక్తులకు అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 12 అధ్యాయాలున్నాయి. వేద మహిమ – వేద లక్షణం, వేద మహిమ – ధర్మలక్షణం, భూలోక -భరతవర్ష ప్రాశస్త్యం, వేదం – సృష్టిక్రమభేదం, సృష్టిస్థిత్యాద్యులకు ధర్మమే కారణం, అగ్నిచయనం అంశాలను వివరించారు. అదేవిధంగా, స్మార్తయజ్ఞాలు -సంస్కారాలు, ఆచార ధర్మాలు, పంచ మహాయజ్ఞ ప్రాశస్త్యం, అధర్మ నిరూపణ, శ్రీరుద్ర మహిమ, బ్రహ్మజ్ఞానం విషయాలను కూలంకషంగా తెలియజేశారు. టిటిడి ధర్మప్రచారంలో భాగంగా పుస్తక ముద్రణను చేపడుతున్న విషయం విదితమే. సంస్కృత భాష, వైదిక పరిభాష పరిచయం లేని సామాన్యులకు, వ్యావహారిక తెలుగు మాత్రమే అలవాటు ఉన్న నేటి, రాబోయే తరాలకు వేద విజ్ఞానాన్ని అందించాలన్న ప్రయత్నమే ఈ గ్రంథం.

పోస్టు ద్వారా గ్రంథం కావాలంటే…

‘వేదం-జీవనవిధానం’ గ్రంథాన్ని పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ”సహాయ కార్యనిర్వహణాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు ఈ గ్రంథాన్ని పంపడం జరుగుతుంది.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.