BRAHMOTSAVAM- EO RELEASES FOUR PUBLICATIONS_ చిన్నశేష వాహనసేవలో 4 ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ

Tirumala, 24 September 2017: On the occasion of the Chinna Sesha Vahanam procession as part of the Second day of annual Brahmotsavam, TTD EO Sri Anil Kumar Singhal released four religious books got up by the TTD publications division .

They were Sri Venkatachala Mahatyam (Skanda Purana Bharatam) by Dr Vishnubhatta Gopalakrishnamurthy, Venkateswara Suprabhatam (Telugu commentary) by Dr VV Venkatramana, Sri Venkateswara Swami ke Daraan (Hindi) and Sri Venkateswara swami Ke Utsav by Dr MR Rajeswari of Tirupati.

Among others TTD CVSO Sri Ake Ravikrishnam, OSD TTD Press Dr Talluru Anjaneyulu and editor Sri N Nasarimhacharyulu and authors participated in the event

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

చిన్నశేష వాహనసేవలో 4 ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ

సెప్టెంబర్‌ 24, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన 4 ఆధ్యాత్మిక గ్రంథాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లూరు ఆంజనేయులు, సబ్‌ ఎడిటర్‌ డా|| నొస్సం నరసింహాచార్యులు, గ్రంథ రచయితలు పాల్గొన్నారు.

శ్రీవేంకటాచల మాహాత్మ్యము(స్కాంద పురాణాంతర్గతము)(మొదటి సంపుటం) :

తిరుపతికి చెందిన డా|| విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి ఈ గ్రంథాన్ని రచించారు. ఇది వేంకటాద్రికి, ఆదివరాహక్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం. దీనికే శ్రీనివాసపురాణమని మరో పేరు కూడా ఉంది. ఇది తిరుమల, తిరుపతి, పరిసర క్షేత్రాలకు సంబంధించిన స్థానిక, పౌరాణిక, చారిత్రక విషయాలను గురించి విలువైన సమాచారాన్ని తెలియజేసే ప్రామాణిక గ్రంథం. ఇందులో వరాహావతారం, ఆయన భూమిని ఉద్ధరించడం, క్రీడాద్రిని వైకుంఠం నుంచి భువికి తెప్పించడం, శ్రీనివాసావిర్భావం, శ్రీపద్మావతీ శ్రీనివాసుల కల్యాణం, శ్రీవేంకటేశ్వర వైభవాన్ని సుందరంగా వర్ణించారు. అదేవిధంగా క్షేత్ర-దైవత-తీర్థ మాహాత్మ్యాలు, భక్తుల-ఋషుల చరిత్రలను కథల రూపంలో వివరించారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం(తెలుగు వ్యాఖ్యానం) :

విజయవాడకు చెందిన డా|| వివి.వేంకటరమణ ఈ గ్రంథాన్ని రచించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారికి జరిగే ఎన్నో సేవలలో సుప్రభాతం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఉన్నాయి. ఈ శ్లోకాలను శ్రీ ప్రతివాద భయంకరణ్ణన్‌స్వామివారు రచించారు. విస్తృత ప్రచారం పొందిన ఈ సుప్రభాతం ఎంతో పేరు కలిగింది. తిరుమలలో నిత్యం పఠించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి డా|| వివి.వేంకటరమణ తెలుగులో సుందరమైన వ్యాఖ్యానం అందించారు. భక్తులందరూ దీన్ని అర్థం చేసుకుని పారాయణం చేయగలరని టిటిడి కోరుతోంది.

శ్రీవేంకటేశ్వరస్వామికే దర్శన్‌ (హిందీ అనువాదం) :

తిరుపతికి చెందిన డా|| ఐఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఈ గ్రంథాన్ని రచించారు. తిరుమలను సందర్శించే యాత్రికులు, భక్తులు తమ యాత్రలో స్వామిని ఎలా దర్శించాలి, ఏమేమి దర్శించాలి అనే విషయాలను తెలియజేసే పుస్తకమిది. ప్రధానంగా క్షేత్రదర్శనం, తీర్థదర్శనం, శ్రీస్వామివారి అర్చామూర్తి దర్శనం, ఉత్సవ దర్శనం ఇలా వరుసగా చేయాలని, అప్పుడే యాత్ర ఫలిస్తుందని, మళ్లీ మళ్లీ యాత్ర చేయాలన్న కుతూహలం కలుగుతుందని తెలియజేశారు. ఈ గ్రంథాన్ని తెలుగులో డా|| హెచ్‌ఎస్‌.బ్రహ్మానంద రాయగా డా|| ఐఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి హిందీలోకి అనువదించారు.

శ్రీవేంకటేశ్వరస్వామికే ఉత్సవ్‌ (హిందీ అనువాదం) :

తిరుపతికి చెందిన డా|| ఎంఆర్‌.రాజేశ్వరి ఈ గ్రంథాన్ని రచించారు. శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, సేవలు జరుగుతున్నాయి. వాటినే నిత్యోత్సవాలని, వారోత్సవాలనీ, మాసోత్సవాలనీ, సంవత్సరోత్సవానీ అంటారు. ఈ పుస్తకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఏడాది పొడవునా జరిగే సేవలను, ఉత్సవాలను శ్రీ జూలకంటి బాలసుబ్రమణ్యం సంక్షిప్తంగా వివరించగా, ఈ పుస్తకాన్ని డా|| ఎంఆర్‌.రాజేశ్వరి హిందీలోకి అనువదించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.