CELESTIAL MARRIAGE ENTHRALLS DENIZENS OF KANCHIPURAM _ కాంచీపురంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం
కాంచీపురంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కాంచీపురంలో శనివారం నాడు శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
కాంచీపురంలోని శ్రీ కామాక్ష్మి అమ్మవారి ఆలయం పక్కన గల విశాలమైన ఎస్‌ఎస్‌కెవి పాఠశాల క్రీడామైదానంలో సాయంత్రం 6.30 గంటలకు మలయప్పస్వామివారికి, ఉభయదేవేరులతో కళ్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు విష్వక్సేన ఆరాధనతో మొదలుపెట్టి పుణ్యాహవచనం, అంకురార్పణ, కంకణధారణ, అగ్నిప్రతిష్ఠ, మహాజన సంకల్పం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. కన్యాదానం అనంతరం ప్రధాన ఘట్టమైన మాంగళ్యధారణతో కళ్యాణోత్సవం ముగిసింది.
తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆరేళ్ల క్రితం స్వామివారి కళ్యాణాలను ప్రారంభించిందని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణోత్సవాన్ని కొంతమంది భక్తులు మాత్రమే తిలకించే అవకాశముందని, అలా కాకుండా భక్తులందరికీ స్వామివారి కళ్యాణాన్ని దర్శింపచేయాలనే సంకల్పంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశం నలుమూలలతో పాటు విదేశాల్లోనూ స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇటీవల ముంబయి, నేపాల్, అమెరికాలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవాలకు భక్తులకనుండి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంతో సమాజంలో భక్తిభావాన్ని పెంచడమే గాకుండా ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోందన్నారు.
కామాక్షి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
అంతకుముందు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు శ్రీ కామాక్షి అమ్మవారికి, శ్రీ వరదరాజస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.