CHAKRASNANAM MARKS GRAND COMPLETION OF SKVST BTUs_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

Srinivasa Mangapuram, 4 Mar. 19: The Navahnika brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple concluded on a grand religious note on Monday with Chakra Snanam.

The anthropomorphic form of Lord Sri Sudarshana Chakrattalwar was rendered the holy bath in Pushkarni.

Earlier snapana tirumanjanam was performed to deities along with Chakrattalwar. Later the temple priests performed holy dip to the disc.

Scores of devotees took part in this fete. Temple DyEO Sri Dhananjeyulu and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

తిరుపతి, 2019 మార్చి 04: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు.

ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీభూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు, చక్రతాళ్వార్‌లకు వైభవంగా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖునిధి, పద్మనిధి, సహస్రధార, కుంభదారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచసూక్త మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి, మొదలగు ఉత్తమ జాతి సాంప్ర‌దాయ పుష్ప‌ మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

అనంతరం ఉదయం 9.45 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, గార్డ‌న్ సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, ఆరోగ్య విభాగం యూనిట్ అధికారి శ్రీ అమ‌ర్‌నాథ్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల విశేషాలు :

– ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ భానుస్వామి ఆధ్వ‌ర్యంలో రోజుకు 15 నుండి 20 వేల మంది భక్తులకు ప‌ది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప‌ర్వ‌దినాల‌లో 25 వేల నుండి 30 వేల మందికి ప్ర‌సాదాలు అందించారు.

– టిటిడి అన్నప్రసాదం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఐదు వేల మందికి సాంబారు అన్నం, పెరుగన్నం, పాలు, మజ్జిగ పంపిణీ చేశారు.

– ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మీడియా సెంటర్‌ ఏర్పాటుచేసి బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 200 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

– టిటిడి వైద్య విభాగం ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

– ఉద్యానవన విభాగం మేనేజ‌ర్ శ్రీ జ‌నార్థ‌న్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 15 టన్నుల పుష్పాలు వినియోగించారు. 90 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపనతిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు.

– ఆరోగ్య విభాగం యూనిట్ అధికారి శ్రీ అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్రతిరోజూ 120 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప్ర‌త్యేక దినాల‌లో 50 మంది అద‌న‌పు సిబ్బంది సేవ‌లందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.