CHINNA SESHA VAHANA SEVA HELD _ చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
చిన్నశేష వాహనంపై గోవిందుని రాజసం
తిరుపతి, 2024 మే 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి చిన్నశేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.