CHINNASESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం
చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం
తిరుపతి, మార్చి 12, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరించారు. ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు ఠీవీగా ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.
వాహన సేవ అనంతరం ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. రాత్రి 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
రామకోటికి అపూర్వ స్పందన
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న రామకోటి లేఖనానికి భక్తుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. తిరుపతి నగరం నుండే గాక ఇతర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లల నుండి వృద్ధుల వరకు రామకోటి లేఖనంలో భాగస్వాములవుతున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు ఉన్నారు. కోదండరామాలయంలో పవిత్రమైన రామకోటి రాయడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు చెబుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అభినయ ఆర్ట్స్, తిరుపతి వారిచే శ్రీరామసేతువు పౌరాణిక పద్యనాటక ప్రదర్శన జరుగనుంది. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కచేరి నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహనాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.