DEVOTEES TAKE PART IN RATHOTSAVAM OF KRT_ అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

Tirupati, 23 March 2018: The devotees competed with each other to pull the chariot on which Lord Sri Rama along with Goddess Sita and Lakshmana Swamy were seated majestically.

This celestial fete commenced at 7am in the holy streets of temple city surrounding Sri Kodanda Rama Swamy temple on Friday.

Devotees pulled the chariot with enthusiasm chanting “Jai Sri Ram”. The entire temple city echoed with Sri Rama Nama on eighth day of brahmotsavams.

SE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi, Executive Engineer Sri Jagadeeswara Reddy, AVSO Sri Ganga Raju, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

మార్చి 23, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధ, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.

సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు అర్చకులు రథమండపంలో తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.

అశ్వవాహనం :

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మూెత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 7 నుండి 8 గంటల వరకు ధర్మగిరి వేద పాఠశాల ఆధ్వర్యంలో వేదపారాయణం నిర్వహించారు.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ కె.శివరత్నం బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఈఈ శ్రీజగదీశ్వర్‌రెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్‌) శ్రీచంద్రశేఖర్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మార్చి 24న చక్రస్నానం :

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 24న శనివారం ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఉదయం 7 గంటలకు స్వామివారు పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయల్దేరతారు. చక్రస్నానం అనంతరం పిఆర్‌.తోటకు వేంచేపు చేసి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.