DIAL YOUR EO EXCERPTS _ డయల్ యువర్ ఇ.ఓ
డయల్ యువర్ ఇ.ఓ
తిరుమల, 06 సెప్టెంబరు 2013: శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల అడిగిన ప్రశ్నలకు, చేసిన సూచనలకు తితిదే ఇఓ శ్రీ ఎం.జి.గోపాల్ స్పందించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి –
1. అనీల్‌కుమార్ – కర్నూలు
వికలాంగులు, వయోవృద్ధుల క్యూలైన్లో కేవలం బైపాస్‌సర్జరీ చేసుకున్న వారినే దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే గుండెకు సంబంధించి స్టంట్ మరియు ఏ ఇతర వ్యాధి ఉన్నవారినైనా అనుమతించితే బాగుటుందని కోరుతున్నాము.
ఇ.ఓ. పరిశీలిస్తాం.
2. దక్షిణామూర్తి – చెన్నై
1. తితిదే వెబ్‌సైట్‌లో అందించిన పలువురు సీనియర్ అధికారుల ఇ-మెయిల్ ఐడీలకు మెయిల్ పంపిస్తుంటే అవి బౌన్స్ అవుతున్నాయి.
2. వయోవృద్ధుల క్యూలైన్లో భర్త గుర్తింపు కార్డు తెచ్చి భార్య తీసుకుని రాకపోయిన దర్శనానికి అనుతించగలరు.
ఇ.ఓ 1. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం.
2. తప్పకుండా సంబంధిత అధికారులకు అనుతించవలసినదిగా ఆదేశిస్తాం.
3. శ్రీవల్లి – ఒంగోలు
తిరుపతి కపిలతీర్థంలో భక్తుల కొరకు ఒక లగేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయగలరు.
ఇ.ఓ తప్పకుండా చేస్తాం.
4. నాగమణి – గుంటూరు
మా సోదరికి కృత్రిమ క్యాలిపర్స్ (లెదర్-జంతుచర్మంతో తయారు చేయబడిన) కాళ్ళు ఏర్పాటు చేయడమైనది. అయితే ఆమెను దర్శనానికి తీసుకుని వెళ్ళడానికి మార్గాన్ని సూచించగలరు.
ఇ.ఓ తిరుమల సాంప్రదాయం ప్రకారం ఆలయంలోనికి ఎటువంటి లెదర్ పరికరాలు అనుమతింపబడవు. ఈ కారణంగా మీ సోదరీమణికి అంగవైకల్యం ఉన్నా లోనికి అనుమతింపలేము. అయితే ఆ క్యాలిపర్స్‌ను తొలగించి దర్శనానికి రావచ్చు. వారిని లోనికి తీసుకుని వెళ్ళడానికి శ్రీవారి సేవకుల సహకారాన్ని అనుమతిస్తాం.
5. ఆర్. లక్ష్మీనారాయణరావు – నెల్లూరు
1. సప్తగిరి మాసపత్రికను సంస్కృతంలో కూడా ప్రచురించగలరు.
2. అదే విధంగా బ్రహ్మోత్సవ వ్యాఖ్యానాలను కూడా సంస్కృతంలో విశ్లేషించగలరు.
ఇ.ఓ సంస్కృతం పట్ల మీ అభిరుచిని స్వాగతిస్తున్నాం. తప్పకుండా మీ సూచనలను అమలుచేస్తాం.
6. అరుణ – సూర్యపేట
వేదాద్రి, బాసర వంటి పుణ్యక్షేత్రాలలో నదీస్నానం ఆచరించే భక్తులకు సరియైన సౌకర్యాలు లేకుండా అవస్థలు పడుతున్నారు. తితిదే చొరవ తీసుకోగలరు.
ఇ.ఓ ఇది తితిదే పరిధిలోని అంశం కాదు. అయిన పాలకమండలి సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి మరియు కమీషనర్ కూడా సభ్యులు కనుక వారి దృష్టికి తప్పకుండా తీసుకునివెళతాం.
7. యమ్. జయచంథ్రేఖరనాయుడు – తిరుపతి
తిరుపతిలోని ఆర్.టి.సి. బస్టాండులో ఇదివరకు రు.50/- సుదర్శన టోకెన్లు మరియు ఉచిత టోకెన్లను ఇచ్చేవారు అయితే ప్రస్తుతం ఈ విధానాన్ని నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించగలరు.
ఇ.ఓ తిరుపతి బస్టాండులో శ్రీవారి సుదర్శన టోకెన్లను గత నాలుగు నెలల నుండి నిలిపివేయడమైనది. చాలా మంది మధ్యవర్తులు దీన్ని వ్యాపారంగా చేసుకుని సమస్యలను సృష్ఠించడంతో ఈ విధానానికి స్వస్తిపలకడమైనది. దయచేసి భక్తులు అర్థం చేసుకుని తితిదేకు సహకరించగలరు.
8. శంకరమంచి శ్రీకుమార్ – డల్లాస్ అమెరిక
గత ఏడాది శ్రీనివాస కళ్యాణాలను అమెరికాలోని పలు నగరాల్లో ఘనంగా తితిదే అధర్వర్యంలో నిర్వహించాము. ఈ ఏడాది కూడా నిర్వహించగలరు.
ఇ.ఓ శ్రీనివాస కళ్యాణాలను ప్రపంచ వ్యాప్తంగా తితిదే పలు మహానగరాల్లో గత ఏడాది అత్యద్భుతంగా నిర్వహించింది. అయితే కొన్ని చోట్ల కొందరు నిర్వాహకులు ఈ సందర్భంగా అనధికారికంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తితిదే కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. ఎవరైతే ఈ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారో తప్పకుండా ఆయా ప్రాంతాలలో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తాము.
ఈ కార్యక్రమంలో తిరుమల సంయుక్తకార్యనిర్వహణాధికారులు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ టి.వెంకట్రామిరెడ్డి, సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్, ఛీఫ్ ఇంజనీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎస్.ఇ2 శ్రీ రమేశ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుక భక్తులు సమర్పించే బంగారంపై భక్తులకు ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. ఇటీవల దేశంలో నెలకొనియున్న ఆర్థిక ఒడిదుడుకుల నేపధ్యంలో తితిదే బంగారాన్ని అంతా భారతీయ రిజర్వుబ్యాంకుకు అమ్మేయనుందన్న వార్తలు అపోహలు మాత్రమే అన్నారు. భక్తులు సమర్పించే బంగారం తితిదే అధీనంలోనే వుంటుందని ఆయన స్పష్టంచేశారు. అంతే కాకుండా ఈ బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో (1.35% వడ్డీ) భద్రపరచడం కూడా జరిగిందన్నారు. ఇటీవలనే ఒక పెట్టుబడి కమిటీని కూడా తితిదే ఈ అంశాలను పర్యవేక్షించడానికి నియమించిందన్నారు. ఇందులో ముఖ్యంగా భారతీయ రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నరు, మాజీ సెబీ ఛైర్మెన్ మరియు నాబార్డు ఛైర్మెన్‌లు కూడా సభ్యులు అన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.