DISCHARGE DUTIES AS PER “KARMA SIDDHANTA”-TTD EO _ తితిదే ఉద్యోగులు కర్మ సిద్ధాంత ధర్మాన్ని ఆచరించాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తితిదే ఉద్యోగులు కర్మ సిద్ధాంత ధర్మాన్ని ఆచరించాలి : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 18: తితిదే ఉద్యోగులు గీతాచార్యుడు చెప్పిన కర్మ సిద్ధాంత ధర్మాన్ని ఆచరించాలని కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో శనివారం ఉద్యోగుల సామూహిక ప్రార్థన కార్యక్రమానికి ఈఓ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఈఓ ప్రసంగిస్తూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఉద్యోగులు తమకు కేటాయించిన పనిని సక్రమంగా చేయాలని, ఫలితాన్ని భగవంతుడికే వదిలిపెట్టాలని పేర్కొన్నారు. అర్చకస్వాములు ప్రత్యక్షంగా శ్రీవారికి కైంకర్యాలు చేస్తుంటారని, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తే ఉద్యోగులు కూడా పరోక్షంగా స్వామివారికి కైంకర్యం చేసినట్టవుతుందని వివరించారు. ఇకపై ప్రతి శనివారం ఉద్యోగులు తిలకధారణతో రావాలని, సంప్రదాయ వస్త్రాలను ధరించి సామూహికంగా ప్రార్థన చేయాలని కోరారు. ఇక్కడ పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి ప్రత్యేకమైన రోజులను మిగతా ఉద్యోగులతో కలసి పంచుకోవచ్చన్నారు. అన్ని విభాగాల్లో ప్రతిరోజూ ప్రార్థన చేయాలని ఈఓ సూచించారు. ఉద్యోగులు స్వామివారి అంతర్యామితత్వాన్ని గ్రహించి మంచి మార్గంలో నడిచి సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రార్థనా గీతం, జాతీయగీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.