గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణప్రసాద్
గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణప్రసాద్
జనవరి 23, తిరుపతి 2019: సనాతన ధర్మాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు కృషి చేయాలని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణ ప్రసాద్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్ క్షేత్ర సిబ్బంది, ధర్మప్రచార మండలి సభ్యులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి చెపడుతున్న సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇప్పటికే ధర్మప్రచార మండలిలో భాగస్వాములైన ధర్మచార్యులు, శ్రీవారిసేవకులు, ప్రచార మండలి సభ్యులు టిటిడి నిర్వహించే మనగుడి, శుభప్రదం, గీత జయంతి, శ్రీవేంకటేశ్వరస్వామివారి రథయాత్ర తదితర కార్యక్రమాలలో మరింత ఎక్కువమందిని భాగస్వాములను చేయాలన్నారు. సనాతన ధర్మ వ్యాప్తికి మొదటి విడతగా ఈ ఏడాది మార్చి 31వ తేదీకి దాదాపు 600 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
అనంతరం పురాణ ఇతిహస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా..సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ భారతీయులు ధర్మ బద్ధంగా వుండేందుకు 4 వేదాలు, 6 అంగములు, అష్టదశ పురాణాలు, తదితర అమూల్యమైన గ్రంథాలను మహర్షులు మనకు అందించినట్లు తెలిపారు. మన పూర్వీకులు మనకు అందించిన వేదాల్లోని సారాన్ని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని ధర్మ బద్ధంగా జీవించిన మహనీయుల పురాణ కథలను వివరించారు.
ఈ కార్య్రకమంలో ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య డి.దామోదరనాయుడు, ఇతర అధికారులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 140 మంది ధర్మ ప్రచార మండలి సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.