Engineers Day celebrations in Tirupati _ ఇంజినీర్లకు స్ఫూర్తిప్రదాత విశ్వేశ్వరయ్య : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
ఇంజినీర్లకు స్ఫూర్తిప్రదాత విశ్వేశ్వరయ్య : తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 సెప్టెంబరు 15: శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యావత్ దేశంలోని ఇంజినీర్లకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొనియాడారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని తితిదే ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ”ఇంజినీర్స్ డే”ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ విశ్వేశ్వరయ్య ఎంతో నిరాడంబరంగా, నిజాయితీగా తన జీవితాన్ని సాగించారని పేర్కొన్నారు. ఆయన తన కాలానికి మించి ఆలోచనలు చేసిన మేధావి అని కొనియాడారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు రూపకల్పన విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలోనే జరిగిందని తెలిపారు. తితిదేలోని ఇంజినీర్లు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఇంజినీరింగ్ పనుల్లో సంస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలని ఈఓ కోరారు.
తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలిపారు. తితిదేలోని ఇంజినీర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు. తాను ఇంజినీరు వృత్తి నుండి వచ్చినందున ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఎక్కువని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విషయాల్లో తితిదేకి అమూల్యమైన సేవలందించిన శ్రీ ఆర్.కొండలరావు, శ్రీ డి.నరసింహారావు, శ్రీ పి.ఎస్.రావును, అసోసియేషన్ ఆధ్వర్యంలో తితిదే రిటైర్డ్ సిఈ శ్రీ వి.ఎన్.బి.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీ కె.కైలాస్‌నాథ్‌ను తితిదే ఈఓ, జెఈఓలు ఘనంగా సన్మానించారు.
తితిదే చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ఈఈలు, ఎస్‌ఈలు, ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.