EO TTD VISIT TO S.V.VEDAPATASALA _ వేదపాఠశాలను సందర్శించిన నూతన ఇ.ఓ
వేదపాఠశాలను సందర్శించిన నూతన ఇ.ఓ
తిరుమల, 07 జూలై 2013 : తితిదే నూతన కార్యనిర్వణాధికారిగా శనివారం పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ ముక్కామల గిరిధర్ గోపాల్ ఆదివారం నాడు ధర్మగిరిలోని వేదపాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతోను, పాఠశాల సిబ్బందితోను ముచ్చటించారు. కాగా ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన వేద విద్యార్థులు ఋగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్ల యజుర్వేదం తైత్తరీయశాఖలోని పంచకాటకాలు, సామవేదం, అదర్వణవేదం, శైవాగమం, వైష్ణవాగమం, పాంచరాత్ర ఆగమం మొదలైన శాఖలలోని మంత్ర పుష్పాలను నివేదించారు.
అనంతరం ఇఓ మాట్లాడుతూ వేద విద్యార్థులు అత్యద్భుతంగా వేద పారాయణం చేస్తున్నారని ప్రసంశించారు. తాను 7 సంవత్సరాల క్రితం అప్పటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నప్పుడు తాను వేద పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు. అప్పట్లో వేద విద్యార్థులు చేసిన వేద పారాయణాన్ని చూసిన అనంతరం శ్రీ రామేశ్వర్ ఠాకూర్ తిరుపతిలో వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అందుకు తగిన ప్రణాళికలను రూపొందించాల్సిన బాధ్యతలను తనకు అప్పగించారన్నారు. నేడు తిరుపతిలోని వేద విశ్వ విద్యాలయం కూడా ఎంతో రాణిస్తూ, ఎందరో వేద విద్యార్థులకు జీవనోపాదిని అందిస్తున్నాదన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు వేద విజ్ఞానం ఎంతో అవసరమని ఆయన అన్నారు. వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అవధాని, ఇతర అధికారులు, వేద అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే . ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.