EXECUTE DUTIES WITH DEVOTION TO REACH THE GOAL-TTD EO _ సమాజంలోని రుగ్మతలను తొలగించడమే అంబేద్కర్‌కు నివాళి : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
సమాజంలోని రుగ్మతలను తొలగించడమే అంబేద్కర్‌కు నివాళి : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, ఏప్రిల్ 14, 2013: ధర్మం, అధర్మం అనే విచక్షణ పాటించి సమాజంలోని రుగ్మతలను తొలగించినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 122వ జయంతిని ఆదివారం ఉదయం తితిదే పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే ఈవో ప్రసంగిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో అట్టడుగు స్థాయి నుండి భారత రాజ్యంగ నిర్మాతగా ఎదిగిన అంబేద్కర్‌ను భారతీయులందరూ ఆదర్శంగా భావించాలన్నారు. ఆయనకు అన్ని శాస్త్రాల్లో విస్తృతమైన పరిజ్ఞానం ఉండేదని తెలిపారు. హైందవ సమాజం ఎల్లప్పుడూ సర్వసమానత్వాన్నే బోధిస్తుందని, అన్నమయ్య, శంకరాచార్యులు లాంటివారు వర్ణ వ్యవస్థను నిరసించారని ఈవో వివరించారు. తితిదే ఉద్యోగులందరూ కర్మ సిద్ధాంతాన్ని పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఉద్యోగులు తమ జీవితంలో ఎలాంటి అపశృతులకు చోటివ్వకుండా చక్కటి శృతిలో సాగిపోవాలని ఈవో ఆకాంక్షించారు.
ఉపన్యాసకులు గుజరాత్‌లోని గాంధీనగర్, ఐ.జి.పి శ్రీ ఇ.రాధాకృష్ణ ప్రసంగిస్తూ అంబేద్కర్ ఇంతటి మహనీయుడు కావడం వెనక సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారం ఉందన్నారు. కష్టపడేతత్వం ఉంటే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తన జీవితాన్ని ఉదాహరణగా వివరించారు. సామాన్య దళిత కుటుంబం నుండి ఐపిఎస్ సాధించడం వెనక గల కృషిని, పట్టుదలను స్ఫూర్తిదాయకంగా తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమశిక్షణే బలమని, తితిదే ఉద్యోగులు దానికి పెద్దపీట వేయాలని సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గురించి ప్రసంగించిన ఎస్వీ ఓరియంటల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.దేవి, శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రవీణ్‌కుమార్, శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థి మహేష్‌కుమార్‌రెడ్డికి రూ.6,200/- చొప్పున నగదు బహుమతులను రాధాకృష్ణ అందజేశారు.
నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ప్రసంగిస్తూ దళిత, గిరిజనులను గౌరవిస్తూ తితిదే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. తితిదేలో ఉద్యోగం లభించడం పూర్వజన్మ సుకృతమని, నిష్టగా పని చేసి భక్తులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
ఎస్వీ యూనివర్సిటీ బాటనీ విభాగాధిపతి ఆచార్య ఎన్.సావిత్రమ్మ ప్రసంగిస్తూ తితిదే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని దళితులకు ఆలయ ప్రవేశం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్డ్ కులాలకు విద్య అవసరాన్ని ఆమె నొక్కి వక్కాణించారు.
అంతకుముందు ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి శ్రీ ఎన్.నారాయణ, తితిదే సివిఎస్‌ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్, తిరుపతి జెఇఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఉద్యోగులు వెంకటరత్నం తదితరులు ప్రసంగించారు.
అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన తితిదే పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఈవో చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే జనవరి 24 నుండి మార్చి 10వ తేదీ వరకు అలహాబాదులోని కుంభమేళాలో తితిదే శ్రీవారి నమూనా ఆలయం వద్ద సేవలందించిన సులభ్ పారిశుద్ధ్య కార్మికులకు ధోవతులు, చీరలు బహుమానంగా అందజేశారు. తితిదే ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవి సభా సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో తితిదే చీఫ్ ఇంజినీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, వెల్ఫేర్ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి, ఏఈఓ శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్, ఎస్.సి.లైజన్ ఆఫీసర్, శ్రీ బి. మనోహరం, ఎస్.టి. లైజన్ ఆఫీసర్ శ్రీ డి. వేణుగోపాల్, సహాయ ప్రజా సంబంధాల అధికారి కుమారి నీలిమ, అధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.