Executive Officer TELECONFERENCE WITH DPP DHARMIC MANDALS _ జిల్లాల్లో మండల స్థాయి ధార్మిక సలహామండళ్ళను ఏర్పాటు చేయాలి
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జిల్లాల్లో మండల స్థాయి ధార్మిక సలహామండళ్ళను ఏర్పాటు చేయాలి
తిరుపతి, జూన్-16, 2009: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న తితిదే ధార్మిక సలహామండలి అద్యకక్షులు, సభ్యులు,డి.పి.పి. కో-ఆర్డినేటర్లు తమతమ జిల్లాల్లో మండల స్థాయి ధార్మిక సలహామండళ్ళను ఏర్పాటు చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి డా||కె.వి.రమణాచారి చెప్పారు. మంగళవారం ఉదయం ఇ.ఓ బంగ్లానందు ఆయన జిల్లా ధార్మిక సలహామండళ్ళ అద్యకక్షులు, కో-ఆర్డినేటర్లతో ”టెలికాన్ఫరెన్స్” నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ జిల్లా ధార్మిక సలహామండలి సభ్యులు జిల్లాలోని మండలాలు ఎన్నుకొని ఆధ్యాత్మిక చింతన కలిగిన వారిని, చురుకుగా పనిచేసే వారిని మండలాల్లోని మఠాధిపతులు, స్వామిజీలను సంప్రదించి 5మందికి తగ్గకుండా, 9మందికి మించకుండా బలహీన వర్గాల వారిని, స్త్రీలనుకూడా కలుపుకొని మండల ధార్మిక సలహామండళ్ళను జూలై 10వ తేదిలోపు ఏర్పాటు చేయాలని చెప్పారు.
అదేవిధంగా ఆయాజిల్లాల్లోని కారాగారాలలో జిల్లా ధార్మిక సలహామండళ్ళ ఆధ్వర్యంలో గీతాగోవిందం కార్యక్రమం నిర్వహించాలని, అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో భజన సంఘాలను సమావేశ పరచి భజగోవిందం కార్యక్రమం జిల్లాల వారీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అన్ని జిల్లాల ధార్మిక సలహామండళ్ళ సభ్యులు ఉత్సాహంతో పనిచేయాలని, తద్వారా మనం ప్రజలకు చేరువ కావడమేగాక, ప్రజలలో భక్తి, అధ్యాత్మిక భావనలు భజన సంస్కృతిని పెంపొందించవచ్చునని అన్నారు.
భజగోవిందం పుస్తకాలు, సిడిలు వెంటనే జిల్లాలకు పంపాలని, భజన మండళ్ళకు తాళాలు, చిడతలు, హార్మోనియం, తబలాలు 15రోజులలోపు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా నవంబర్ లోపు రాష్ట్రవ్యాప్తంగా భజన పోటీలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ధర్మప్రచార పరిషత్ ధార్మిక సలహామండళ్ళ అద్యకక్షులు, ఆర్గనైజర్లను కోరారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో కేంద్రధార్మిక సలహామండలి అద్యకక్షులు శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, తితిదే ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా||చిలకపాటి విజయరాఘవాచార్యులు, ఏ.ఇ.ఓ. శ్రీ మునిరాజ, ఎస్.ఇ.ఎలక్ట్రికల్ శ్రీ మురళీధరరావు, డి.ఇ. శ్రీ రవిశంకర్ రెడ్డి, డి.పి.పి. పరిపాలనాధికారి శ్రీ సూర్యనారాయణ, టెలికం అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.