FLORAL ABHISHEKAM RENDERED _ అలంకార ప్రియునికి విరులమాల పుష్పయాగంతో పులకించిన తిరుమల

Tirumala 04 Nov 2019: The annual Pushpayaga Mahotsavam was performed with religious fervour in Tirumala temple on Monday.

Pushpayagam is usually observed on the advent of Sravana Nakshatra day in the auspicious month of Karthika as a “Pariharotsavam” to the commissions and omissions performed either knowingly or unknowingly during annual brahmotsavams. It is also observed seeking good rains and bestow prosperity on mankind.

HISTORICAL BACKGROUND

As per the existing historical evidence, Pushpayagam was in vogue since 15th Century. But due to unknown reasons it was dispensed for some time and again on November 14 in 1980 it was reinstated by TTD.

14 VARIETIES OF FLOWERS

About eight tonnes of 14 varieties of flowers and six varieties of leaflets have been utilized to perform this colourful floral bath to the deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi. The flowers shower was rendered for 20 times to the deities seated on a special platform in the Kalyanotsava Mandapam. 

TTD EO Sri Anil Kumar Singhal and other officers took part in this fete which was observed between 1pm and 5pm on Monday.

 

TTD has cancelled all arjitha sevas including Visesha Puja, Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Vasanthotsavam in this connection.

PROCESSION OF FLOWERS

Earlier, the procession of flowers took place from Garden Office to Tirumala temple where in the Additional EO Sri AV Dharma Reddy participated in the special puja along with Garden Superintendent Sri Srinivasulu and Temple DyEO Sri Harindranath. 

The flowers included aromatic, traditional and ornamental ones viz. Crysanthimum, Lillies, Nerium, Crossandra, Lotus, Jasmine etc.and leaves like Aegle marmelos, Basil, Oregano etc. Of these 8 tonnes of flowers, 5 tonnes are donated by donors from Tamilnadu, 2 tonnes from Karnataka and one tonne from AP and TS for the fete. 

Over 200 Srivari Sevakulu were deployed apart from the Garden staff to carry the flower baskets over their heads in a colourful procession.

SNAPANAM PERFORMED

Earlier during the day snapana tirumanjanam was perfromed to the dieties between 8am to 11am

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI   

అలంకార ప్రియునికి విరులమాల పుష్పయాగంతో పులకించిన తిరుమల

తిరుమల 2019, నవంబరు 04: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.

శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో అర్చకుల వల్లగానీ, ఉద్యోగుల వల్లగానీ, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

పుష్పాధిదేవుడు ”పుల్లుడు” ఆవాహన :

పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చిని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించడంతో శ్రీవారి పుష్పయాగం నేత్రపర్వంగా ముగిసింది.

అనంతరం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు. పుష్పయాగానికి మొత్తం 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించిన‌ట్లు తెలిపారు. త‌మిళ‌నాడు నుండి 5 ట‌న్నులు, క‌ర్ణాట‌క నుండి 2 ట‌న్నులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి క‌లిపి ఒక ట‌న్ను పుష్పాలు, ప‌త్రాలను దాతలు విరాళంగా అందించార‌న్నారు.

వేడుకగా స్నపన తిరుమంజనం :

పుష్పయాగం సందర్భంగా ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో అభిషేకం చేసి చివరగా చందనలేపనాన్ని అలంకరించారు. ఆ తరువాత తులసిమాలలను ధరింపజేసి నక్షత్రహారతి నివేదించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచసూక్తాలు, ఉపనిషత్తుల్లోని మంత్రాలను పఠించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

శ్రీవారి పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది. సోమ‌వారం ఉదయం తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. శ్రీవారి ఆలయం వద్ద టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆలయ అర్చకులు పుష్పాలను స్వీకరించారు. పుష్పాల ఊరేగింపులో ఉద్యానవన విభాగం సిబ్బందితో పాటు  200 మందికి పైగా  శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం :

శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులును టిటిడి ఈవో, అద‌పు ఈవో శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సంద‌ర్భంగా ఆర్జితసేవలైన విశేష పూజ‌, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ లోక‌నాథం, ఇత‌ర అధికారులు,  విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.