“GOVARDHANAGIRIDHARI” TAKES ROUND ON SURYA PRABHA_ సూర్యప్రభ వాహనంపై గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు

Tiruchanur, 21 November 2017: Goddess Padmavathi Devi in all Her elegance took celestial ride on Suryaprabha Vahanam as “Govardhanagiridhari”.

The Suryaprabha Vahanam has been decked with bright Orange-red coloured Ixora flowers with enhanced the beauty of Universal Mother.

Holding flute in one hand and lifting the manmoth Govardhana mountain over her left hand little finger, the Goddess sent a message to her devotees that She is always protect them if they truly surrender without any selfish desires.

TTD EO Anil Kumar Singhal, JEO Tirupati Sri P Bhaskar, Spl Gr DyEO Sri Muniratnam Reddy, CVSO Sri Ake Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

సూర్యప్రభ వాహనంపై గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2017 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

వాహనసేవ అనంతరంమధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీఆకే.రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వో శ్రీ పార్ధసారధిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

చంద్రప్రభ వాహనంపై సిరుల తల్లి

రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదునారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

నవంబరు 22న రథోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7.00 గంటలకు వృశ్చిక లగ్నంలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. సర్వాలంకార సంశోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.