GUJARATI GARBHA, UTTARAKHAND CHOLIA, PUNJABI BHANGRA STEAL THE SHOW _ హంస వాహనంపై శ్రీవారికి కళాకారుల నృత్య నీరాజనం

Tirumala, 16 September 2026: The devotees rejoiced in the art forms of Bangra, Cholia and Garbha in Tirumala on Wednesday evening in front of Hamsa Vahanam.

Drums, Lambadi dance, Karrasamu, Kolatam are a few other artforms that enthralled the devotees.

A total of 504 artistes belonging to 19 teams from 08 states performed various dance forms 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

హంస వాహనంపై శ్రీవారికి కళాకారుల నృత్య నీరాజనం

8 రాష్ట్రాల 19 కళా బృందాలతో కనువిందైన సాంస్కృతిక ప్రదర్శనలు

జానపద కళలతో తిరుమాడ వీధుల్లో వెల్లివిరిసిన భారతీయ సంస్కృతి వైభవం

తిరుమల, 2026 సెప్టెంబరు 16: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి హంస వాహనసేవ భక్తి వైభవంతో, సాంస్కృతిక శోభతో ఘనంగా జరిగింది. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో కొలువైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ప్రసాదించారు.

శ్రీవారి హంస వాహనసేవలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు 8 రాష్ట్రాలకు చెందిన 19 కళా బృందాల నుంచి 504 మంది కళాకారులు పాల్గొని విభిన్న జానపద, సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులను అలరించారు.

నారాయణ దివ్యప్రబంధ గానంతో ఆధ్యాత్మిక శోభ

శ్రీవారి వాహనానికి ముందుగా జీయర్‌స్వాములు నారాయణ దివ్యప్రబంధాన్ని గానం చేస్తూ ముందుకు సాగారు. వందలాది మంది శ్రీవైష్ణవులు వారిని అనుసరించారు. అశ్వ, వృషభ, గజరాజుల విన్యాసాలు తిరుమాడ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆకట్టుకున్న జార్ఖండ్‌ చౌ నృత్యం

జార్ఖండ్‌కు చెందిన శ్రేష్ఠిధర్ మహతో బృందం ప్రదర్శించిన చౌ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముసుగులు ధరించి శరీర కదలికలు, ప్రత్యేక అడుగులు, యుద్ధ విన్యాసాలతో ప్రదర్శించే ఈ కళారూపంలో రామాయణం, మహాభారతం, పురాణ గాథలను అభినయిస్తారు.

ఎగరడం, గిర్రున తిరగడం, యుద్ధ విన్యాసాలు చేయడం చౌ నృత్యంలోని ప్రత్యేకతలు. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వివిధ శైలుల్లో ప్రదర్శించే చౌ నృత్యం నృత్యం, నాటకం, యుద్ధకళల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది.

గర్బాతో గుజరాతీ సంప్రదాయాల సందడి

గుజరాత్‌కు చెందిన గర్బా నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయబద్ధంగా దీపంతో కూడిన మట్టి కుండ చుట్టూ స్త్రీ, పురుషులు కలిసి చేసే ఈ నృత్యం ఉత్సాహభరితంగా సాగింది.

యుద్ధ విన్యాసాలతో చోలియా నృత్యం

ఉత్తరాఖండ్‌కు చెందిన చోలియా నృత్యం కళాకారుల యుద్ధ విన్యాసాలతో ఆకట్టుకుంది.

పంజాబ్‌కు చెందిన కళాకారుల భాంగ్రా నృత్యం ఉత్సాహభరితమైన అడుగులతో తిరుమాడ వీధుల్లో సందడి చేసింది. పంటల పండుగలతో అనుబంధం ఉన్న భాంగ్రా నృత్యం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.

దేశం నలుమూలల జానపద కళల సమ్మేళనం

వీటితోపాటు కర్రసాము, కోలాటం, డ్రమ్స్, లంబాడీ నృత్యం, యోగచాప్ తదితర కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దేశంలోని విభిన్న ప్రాంతాల జానపద కళలకు వేదిక కల్పించడం ద్వారా “ఏకం సత్‌ – విభిన్న కళా సంప్రదాయాలు” అనే భారతీయ సాంస్కృతిక వైవిధ్యం భక్తులకు కనువిందు చేసింది. భక్తి, కళ, సంప్రదాయం మేళవింపుతో హంస వాహనసేవ తిరుమాడ వీధుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.