HANUMANTHA VAHANAM HELD _ హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు 

TIRUPATI, 16 FEBRUARY 2023: On the sixth day morning Hanumantha Vahana Seva was held in Srinivasa Mangapuram.

 

As part of the ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy, Lord as Venkatadri Ramudu blessed His devotees.

 

Special Gr DyEO Smt Varalakshmi and other officials, were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

తిరుపతి, 2023 ఫిబ్ర‌వ‌రి 16: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట – కౌసల్య, చింతచెట్టు – దశరథుడు, శేషాచలం – లక్ష్మణుడు, పర్వతప్రాంతం – అయోధ్య అని పేర్కొనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.

కాగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జ‌రుగ‌నుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.