తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.13 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.13 కోట్లు

తిరుమల, 2018 ఏప్రిల్‌ 05: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.7.13 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈవేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 34,000 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 9,500 కిలోలను వేలానికి ఉంచగా 1200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.269.94 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 41,100 కిలోలను వేలానికి ఉంచగా 2400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.413.38 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,901/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 100 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.2.98 లక్షల ఆదాయం లభించింది.

కిలో రూ.36/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 30,000 కిలోలను వేలానికి ఉంచగా 30,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.10.80 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 5,900 కిలోలను అమ్మకానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.16.39 లక్షల ఆదాయం సమకూరింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.